Cyclone Fengal: మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకనున్న ఫెంగల్ తుపాను.. చెన్నైలో కుండపోత.. విమానాల రద్దు

Cyclone Fengal landfall in hours near Puducherry flights hit as rain pounds Chennai
  • సాయంత్రం పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకనున్న తుపాను
  • ఆ సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • ఈ ఉదయం నుంచి పలు జిల్లాల్లో కుండపోత వానలు
  • స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. ప్రజా రవాణా కూడా కొన్ని రోడ్లపై నిలిపివేత
  • ఏడు తీరప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ 
ఫెంగల్ తుపాను ఈ సాయంత్రం తీరం దాటనున్న నేపథ్యంలో తమిళనాడు రాజధాని చెన్నై సహా పొరుగున ఉన్న పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరైకల్, పుదుచ్చేరి సమీపంలోని మహాబలిపురం సమీపంలో తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. భారీ వర్షాలు జీవనాన్ని అతలాకుతలం చేశాయి. చెన్నై విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే పలు లోకల్ రైళ్ల సర్వీసులు కూడా నిలిచిపోయాయి. 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన కారణంగా తమిళనాడులోని ఏడు తీర ప్రాంతాల్లో ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీచేసింది. తుపాను పుదుచ్చేరి తీరాన్ని తాకే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షం కారణంగా చెన్నై ఎయిర్‌పోర్టులో పది విమానాల రాకపోకలు రద్దయ్యాయి. విమానాలను రద్దు చేసినట్టు ఇండిగో ప్రకటించింది. అబుదాబి నుంచి చెన్నై రావాల్సిన ఇండిగో విమానం (6ఈ1412)ను బెంగళూరుకు మళ్లించారు. సబర్బన్ పరిధిలోని అన్ని లోకల్ రైళ్ల సర్వీసులను కుదించారు. 

చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించింది. చెన్నైతోపాటు సమీపంలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, మయిలదుతురై, నాగపట్టణం, తిరువూరు వంటి డెల్టా జిల్లాల్లో ఈ ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది.  ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రధాన రోడ్లపై ప్రజా రవాణాను ప్రభుత్వం నిలిపివేసింది. తమిళనాడు వ్యాప్తంగా 2,220 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 500 మందిని వాటిలోకి తరలించారు.  
Cyclone Fengal
Tamil Nadu
Puducherry
Heavy Rains

More Telugu News