Death Clock: మీరు ఎప్పుడు చనిపోతారో ఈ యాప్ ఇప్పుడే చెప్పేస్తుందట!
- కృత్రిమ మేధతో డెత్ క్లాక్ యాప్ తయారు చేసిన అమెరికా కంపెనీ
- జులైలో మార్కెట్లోకి రిలీజ్ చేయగా.. 1.25 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారట
- ఆహారం, వ్యాయామం, ఒత్తిడి స్థాయిలు, నిద్రించే సమయం తదితర వివరాల ఆధారంగా మరణం అంచనా
గర్భం దాల్చిన మహిళ ఏ సమయంలో ప్రసవిస్తుందో కాస్త అటుఇటుగా డాక్టర్లు చెప్పగలరు.. కానీ, ఓ వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడనేది మాత్రం ఎవరూ చెప్పలేరు. హాయిగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి ప్రాణం వదిలేయొచ్చు.. శుభకార్యంలో సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోవచ్చు.. సోషల్ మీడియాలో ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. మరణాన్ని ముందుగా అంచనా వేయడం అసాధ్యమని అందరికీ తెలుసు అయితే తమ ఏఐ ఆధారిత డెత్ క్లాక్ తో మీరు ఎప్పుడు చనిపోతారో చెప్పేస్తామని అమెరికాకు చెందిన ఓ కంపెనీ అంటోంది. మీరు తినే తిండి, రోజువారీగా చేసే పనులు, ఇతరత్రా అలవాట్ల గురించి చెబితే మీ మరణం మిమ్మల్ని ఎప్పుడు పలకరిస్తుందో దాదాపు కచ్చితంగా చెప్పేస్తామని దీమా వ్యక్తం చేస్తోంది. ఇందుకోసం మొబైల్ యాప్ ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది.
అమెరికాకు చెందిన సెన్సర్ టవర్ కంపెనీ ‘డెత్ క్లాక్’ యాప్ ను తయారుచేసింది. కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన ఈ యాప్ చావును ముందుగానే అంచనా వేసి చెబుతుందట. ఏకంగా 53 మిలియన్ల మందిని ప్రశ్నించి, మనిషి జీవితకాలానికి సంబంధించి జరిపిన 1,200 లకు పైగా అధ్యయనాల ఫలితాలను విశ్లేషించి ఈ యాప్ ను రూపొందించినట్లు కంపెనీ వివరించింది. గత జులైలో ఈ యాప్ ను మార్కెట్లోకి రిలీజ్ చేయగా.. ఇప్పటి వరకు 1.25 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపింది.
ఎప్పుడు మరణిస్తామనే విషయం తెలుసుకోవడానికి ఈ యాప్ లో ముందుగా వయసు, తీసుకునే ఆహారం, రోజూ చేసే వ్యాయామం, నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి స్థాయులు, రోజువారీగా నిద్రించే సమయం తదితర వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుందని దీని రూపకర్త బ్రెంట్ ఫ్రాన్సన్ తెలిపారు. ఈ వివరాల ఆధారంగా ఈ యాప్ మీరు చనిపోయే డేట్ ను అంచనా వేసి చెబుతుందని వివరించారు. ఈ యాప్ తో ఉపయోగం ఏంటని అడగగా.. మరింత ఎక్కువ కాలం జీవించేందుకు ఈ యాప్ తోడ్పడుతుందని ఫ్రాన్సన్ చెబుతున్నాడు. మరణించే తేదీ గురించి అంచనా తెలిశాక మనకు తెలియకుండానే ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుందని, ఆరోగ్యకరమైన అలవాట్లను తప్పనిసరిగా అలవాటు చేసుకుని హెల్తీ లైఫ్ లీడ్ చేసేందుకు ప్రయత్నిస్తామని వివరించారు.