Bank: రూ.295 కట్ చేశారని ఏడేళ్లపాటు బ్యాంక్ తో ఫైట్ చేసిన కస్టమర్
- చెక్ డిడక్షన్ ఛార్జీ పేరుతో ఖాతాలో నుంచి డబ్బు కట్ చేసిన బ్యాంక్
- ఖాతాలో తగినంత ఉండగా చెక్ బౌన్స్ అయ్యే చాన్సేలేదన్న కస్టమర్
- డబ్బుల కోసం కాదు హక్కుల కోసమే పోరాడానన్న ఖాతాదారుడు
చెక్ డిడక్షన్ చార్జీ అంటూ తన ఖాతాలో నుంచి అనవసరంగా డబ్బు కట్ చేసిన బ్యాంక్ పై ఓ కస్టమర్ సుదీర్ఘంగా పోరాడారు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడేళ్లు న్యాయ పోరాటం చేసి తన ఖాతాలో నుంచి తగ్గించిన రూ.295 తిరిగి పొందాడు. బ్యాంక్ కట్ చేసిన మొత్తం చిన్నదేనని వదిలేయకుండా ఓ వినియోగదారుగా తన హక్కులను కాపాడుకోవడానికి పోరాడానని నిశాంత్ చెప్పారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లాలోని ఓ బ్యాంకులో చోటుచేసుకుందీ ఘటన.
జబల్ పూర్ జిల్లా పనాగర్ కు చెందిన నిశాంత్ తామ్రకార్ 2017లో ఓ వాషింగ్ మెషిన్ కొనుగోలు చేశాడు. దీనికి అయిన మొత్తాన్ని ఈఎంఐ విధానం కింద చెల్లించాడు. మొదటి నెల ఈఎంఐ చెల్లించినపుడు బ్యాంకు అదనంగా తన ఖాతాలో నుంచి రూ.295 లు కట్ చేసింది. దీనిపై బ్యాంకును సంప్రదించగా.. చెక్ డిడక్షన్ ఛార్జీ అని బ్యాంకు సిబ్బంది వివరణ ఇచ్చారు. తన ఖాతాలో ఎప్పుడూ తగినంత నిల్వ ఉంటుందని, చెక్ బౌన్స్ అయ్యే ఛాన్సే లేదని నిశాంత్ వాదించాడు. తన డబ్బులు తనకు తిరిగివ్వాలని కోరగా బ్యాంకు సిబ్బంది నిరాకరించారు.
బ్యాంక్ సిబ్బంది నిర్వాకంపై మండిపడ్డ నిశాంత్ ఈ విషయాన్ని వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకెళ్లాడు. రూ.3 వేలు సెక్యూరిటీ డిపాజిట్ కింద జమ చేసి ఫిర్యాదు చేశాడు. జబల్ పూర్ వినియోగదారుల కోర్టులో ఈ కేసు దాదాపు ఏడేళ్ల పాటు విచారణ జరిగింది. నవంబర్ 29న కోర్టు తుది తీర్పు వెలువరించింది. నిశాంత్ ఖాతాలో నుంచి కట్ చేసిన రూ.295 తిరిగివ్వాలని బ్యాంకును ఆదేశించింది. దీంతో పాటు రూ.4 వేలు పరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది.