Arvind Kejriwal: కేంద్రంపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

Arvind Kejriwal Sensational Comments On Liquid Attack At AAP Rally

  • ప్రజలను కాపాడాలని అడిగితే తనపై దాడులు చేయిస్తున్నారని ఫైర్
  • ఢిల్లీలో శాంతిభద్రతలను గాలికి వదిలేసిందంటూ కేంద్రంపై మండిపాటు
  • శనివారం తనపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ అమిత్ షాపై విమర్శలు
  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుపెట్టుకోబోమని వివరణ

ఢిల్లీలో శాంతిభధ్రతలు క్షీణించాయని, ప్రజలను కాపాడాలని అడిగినందుకు కేంద్ర ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఢిల్లీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళితే పరిష్కారం చూపిస్తుందని తాను భావించానని కేజ్రీవాల్ చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించి చర్యలు చేపడతారని భావించా కానీ తననే టార్గెట్ చేస్తారని, ఇలా దాడులు చేపిస్తారని అనుకోలేదని మండిపడ్డారు. శనివారం సాయంత్రం మాలవీయ నగర్ లో పాదయాత్ర చేసిన కేజ్రీవాల్ పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.

చేతిలోని లిక్విడ్ ను కేజ్రీవాల్ పైకి విసిరాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తిని విచారిస్తున్నారు. తాజాగా ఈ ఘటనను ప్రస్తావిస్తూ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

కాగా, వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కానీ కూటమిలోని ఇతర పార్టీలతో కానీ ఆప్ కలిసి పోటీ చేసే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించగా... అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నం తాము చేయలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వివరించారు. 

కేజ్రీవాల్ కు మాత్రమే ఇలా జరుగుతుందేంటి?: బీజేపీ లీడర్ సెటైర్లు

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ పై శనివారం జరిగిన దాడిని, దీనిపై ఆయన కేంద్రంపై చేసిన ఆరోపణలను బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ ఖండించారు. కేజ్రీవాల్ కు మాత్రమే ఇలాంటి ఘటనలు జరుగుతాయి ఎందుకని అంటూ ఢిల్లీ వాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. మాలవీయ నగర్ లో కేజ్రీవాల్ పై జరిగిన లిక్విడ్ దాడి ఆప్ చేసిన స్టంట్ అని, ప్రజల్లో సింపతీ పొందేందుకు ఆ పార్టీ స్వయంగా ఈ ప్లాన్ చేసిందని సచ్ దేవ ఆరోపించారు. కేజ్రీవాల్ పై పోసింది నీళ్లే తప్ప ఆప్ నేతలు ఆరోపిస్తున్నట్లు స్పిరిట్ కాదని వివరించారు. ఈ విషయంపై పోలీసులు స్పష్టత ఇచ్చారని సచ్ దేవ గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News