Team England: 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో నమ్మశక్యం కాని రికార్డు సాధించిన ఇంగ్లండ్

England Register Unbelievable Record In Test Cricket Against New Zealand
  • మూడు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న ఇంగ్లండ్
  • క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో విజయం
  • బజ్‌బాల్ గేమ్‌తో 104 పరుగుల లక్ష్యాన్ని 12.4 ఓవర్లలోనే ఛేదించిన పర్యాటక జట్టు
  • టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా వంద పరుగుల లక్ష్యాన్ని అందుకున్న జట్టుగా రికార్డు
మూడు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ జట్టు క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో నిన్న 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతోపాటు అత్యంత అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ ఓవర్లలో 100కుపైగా పరుగులు సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది. 104 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆటతీరుతో 12.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. 

లక్ష్య ఛేదనలో ఒక పరుగుకే ఓపెనర్ జాక్ క్రాలీ (1) వికెట్‌ను కోల్పోయింది. అయితే, మరో ఆటగాడు బెన్ డకెట్ దూకుడుగా ఆడాడు. 18 బంతుల్లోనే 27 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇందులో నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్ ఉన్నాయి. అరంగేట్ర టెస్ట్ ఆటగాడు జాకోబ్ బెథెల్ 37 బంతుల్లో అజేయంగా అర్ధ సెంచరీ (50 పరుగులు) సాధించాడు. అతడి స్కోర్‌లో 8 బౌండరీలు, సిక్సర్ ఉన్నాయి. జో రూట్ మూడు బౌండరీలు, సిక్సర్‌తో 15 బంతుల్లోనే 23 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ సునాయాస విజయం సాధించింది. మొత్తంగా 12.4 ఓవర్లలోనే 100కుపైగా పరుగులను ఛేదించిన ఇంగ్లండ్ 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా అవతరించింది. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 

2017లో బంగ్లాదేశ్‌తో ఇదే వేదికపై జరిగిన మ్యాచ్‌లో కివీస్ 109 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో సాధించింది. ఇప్పుడా రికార్డును ఇంగ్లండ్ తుడిచిపెట్టేసింది. అలాగే, లక్ష్య ఛేదనలో 8.21 రన్‌ రేట్ సాధించింది. 100, ఆపై పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓ జట్టు సాధించిన అత్యధిక రన్‌రేట్ ఇదే కావడం గమనార్హం. 1983లో కింగ్‌స్టన్‌లో భారత్‌తో జరిగిన మ్యా‌లో విండీస్ 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 6.82 రన్ రేట్ సాధించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా, ఇప్పుడా రికార్డును కూడా ఇంగ్లిష్ జట్టు బద్దలు గొట్టింది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది మరో రికార్డు.  
Team England
Team New Zealand
Test Cricket
Cricket News

More Telugu News