Gruha Jyothi: గృహజ్యోతి పథకంపై సీఎం రేవంత్ ట్వీట్
- హైదరాబాద్ లో 10 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ది
- సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా ఇందిరమ్మ పాలన
- ప్రజాప్రభుత్వం సంకల్పం సత్ఫలితాలిస్తోందన్న సీఎం
పేదలపై కరెంట్ బిల్లు భారం తప్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘గృహజ్యోతి’ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించే కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ అందిస్తోంది. దీంతో ఆయా కుటుంబాలకు కరెంట్ బిల్లు చెల్లించే అవసరం తప్పింది. ఆమేరకు కుటుంబాలపై భారం తగ్గింది. ఈ పథకంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.
పేదల ఇంట విద్యుత్ వెలుగులు పంచాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలను ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం కింద కేవలం హైదరాబాద్ లోనే 10.52 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని సీఎం చెప్పారు. ఈ పరిణామం హర్షణీయం అని పేర్కొన్నారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా ఇందిరమ్మ పాలన నిలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.