Shobitha: అందువల్లే నటి శోభిత ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చు: మాదాపూర్ డీసీపీ
- శోభితది ఆత్మహత్య అని విచారణలో తేలిందన్న డీసీపీ
- ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని వెల్లడి
- మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని వివరణ
నటనకు దూరంగా ఉండటం, అవకాశాలు లేకపోవడం వల్ల కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. శోభిత మృతిపై ఆయన మీడియాతో మాట్లాడారు. శోభితది ఆత్మహత్య అని విచారణలో వెల్లడైందన్నారు. ఆమె మృతిపై కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. అయితే ఈ ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
దొరికిన ఆధారాలను బట్టి ఆత్మహత్యగా తేల్చామన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం కాలేదన్నారు. ఆత్మహత్యకు ముందు డైరీలో ఏమైనా రాసుకుందా? స్నేహితులకు ఏమైనా సందేశం పంపించిందా? అని చెక్ చేస్తున్నామన్నారు.
భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు.