Sunil Gavaskar: ఆస్ట్రేలియా మీడియాపై గవాస్కర్ ఫైర్

Sunil Gavaskar fires on Australian media

  • టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
  • పెర్త్ టెస్టులో టీమిండియా ఘనవిజయం
  • పెర్త్ టెస్టుకు ముందు ఆసీస్ మీడియా భయపెట్టే ప్రయత్నం చేసిందన్న గవాస్కర్

పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం సాధించడం తెలిసిందే. ఆస్ట్రేలియాలోని అన్ని మైదానాల్లోకెల్లా పెర్త్ ను ఫాస్టెస్ట్ పిచ్ గా చెబుతుంటారు. పెర్త్ పిచ్ పై భారత బోల్తా పడడం ఖాయమని, పిచ్ పై పేస్, బౌన్స్ తో టీమిండియా బ్యాటర్లు హడలిపోతారని తొలి టెస్టుకు ముందు ఆసీస్ మీడియాలో కథనాలు వచ్చాయి. 

తాజాగా ఈ కథనాలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. పెర్త్ పిచ్ ను ఆసీస్ మీడియా ఓ బూచిగా చూపే ప్రయత్నం చేసిందని విమర్శించారు. 

సహజంగానే మాటల దాడి చేసే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈసారి మౌనంగా ఉన్నారని, కానీ కొన్ని ఆసీస్ మీడియా చానళ్లు, పత్రికల్లో పనిచేసే వారి సపోర్టింగ్ స్టాఫ్ మాత్రం నోరు పారేసుకున్నారని గవాస్కర్ మండిపడ్డారు. పెర్త్ పిచ్ అంటే ఏదో నిప్పుల కుంపటి అని టీమిండియా బ్యాట్స్ మెన్ ను భయపెట్టే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. పెర్త్ లో టీమిండియా గెలిచాక ఆస్ట్రేలియా శిబిరంలో భయం నెలకొందని గవాస్కర్ పేర్కొన్నారు. 

ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ గట్టి పట్టుదలతో అమోఘంగా ఆడారని కితాబిచ్చారు. ఇక, ఆసీస్ పేసర్ జోష్ హేజెల్ వుడ్ పెర్త్ టెస్టు ముగిసిన తర్వాత చేసిన వ్యాఖ్యలతో వారి జట్టులో ఏదో జరుగుతోందన్న విషయం అర్థమవుతోందని గవాస్కర్ తన కాలమ్ లో అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News