PDS Rice Smuggling: రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇకపై వ్యవస్థీకృత నేరం: ఏపీ ప్రభుత్వ నిర్ణయం

AP Govt Cabinet Sub Committee held meeting in Amaravati
  • నేడు రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
  • పోలీస్, రవాణా, సివిల్ సప్లైస్, మారిటైమ్ బోర్డు అధికారులతో సమీక్ష 
  • రాష్ట్రంలోని పోర్టుల నుంచి బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయం
పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని ఇకపై వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కూడిన మంత్రివర్గ ఉప సంఘం నేడు సమావేశమైంది. 

ఈ సమావేశంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టులో వ్యవహారాలపై చర్చించారు. కాకినాడ పోర్టులో భద్రత వ్యవస్థను బలోపేతం చేయాలని, ఇందులో భాగంగా  కాకినాడ పోర్టు భద్రత కోసం ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తున్నందున పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

కాకినాడ పోర్టు, పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలపై నిఘాను కట్టుదిట్టం చేయనున్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 

కాకినాడ పోర్టులోని 5 వేర్ హౌసుల్లో సార్టెక్స్ మిషన్లు ఉన్న అంశంపై చర్చించారు. వేర్ హౌసుల్లో యంత్రాలు ఏ విధంగా ఏర్పాటు చేశారని మారిటైమ్ బోర్డు, కాకినాడ పోర్టు అధికారులను మంత్రులు ప్రశ్నించారు. సార్టెక్స్ యంత్రాల ఏర్పాటుపై విచారణ చేపట్టాలని, అందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ, లా అండ్ ఆర్డర్ ఐజీ., సివిల్ సప్లైస్ ఎక్స్ అఫిషియో సెక్రెటరీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ., మారిటైమ్ బోర్డు సీఈవో., కస్టమ్స్ అధికారి, కాకినాడ పోర్టు అధికారులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. 
PDS Rice Smuggling
Cabinet Sub Committee
Nadendla Manohar
Atchannaidu
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News