Alla Nani: టీడీపీలో చేరనున్న ఆళ్ల నాని..!
- ఈరోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న ఆళ్ల నాని
- మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నాని
- గత ఎన్నికల్లో ఓటమితో వైసీపీకి రాజీనామా
ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని (కాళీకృష్ణ శ్రీనివాస్) టీడీపీలో చేరనున్నారని సమాచారం. దీనికోసం ఇప్పటికే అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈరోజు సచివాలయంలో జరిగే కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.
ఇక గత ఎన్నికల్లో ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆళ్ల నాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.
ఆ తర్వాత కొంతకాలానికి ఆయన జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, చివరికి టీడీపీ వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. నాని మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా, నాని టీడీపీలో చేరేందుకు విజయనగరం జిల్లాకు చెందిన ఓ కీలక నేత టీడీపీ పెద్దలతో మంతనాలు జరిపి ఒప్పించినట్లు తెలుస్తోంది.