Visakhapatnam: విశాఖలో విషాదం .. భవనం పైనుండి దూకి ప్రేమజంట ఆత్మహత్య
- గాజువాకలో ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకేసిన ప్రేమ జంట
- దుర్గారావు, సుష్మిత అక్కడికక్కడే మృతి
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
విశాఖపట్నంలోని గాజువాక పరిధిలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మిత గాజువాకలోని ఓ ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కుటుంబాలవారు అమలాపురం నుంచి బతుకుదెరువు కోసం విశాఖకు వలస వచ్చి షీలానగర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో దుర్గారావు, సుష్మిత మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారు ఇద్దరు ఓ అపార్ట్‌మెంట్ పైనుండి దూకడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కాలనీ వాసులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.