Payyavula Keshav: మా కుటుంబంతో వియ్యం ఏర్పడ్డాక వారు బియ్యం వ్యాపారం చేయడంలేదు: మంత్రి పయ్యావుల
- కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అంశం
- కూటమి, వైసీపీ నేతల మధ్యల మాటల యుద్ధం
- ఆర్థికమంత్రి వియ్యంకుడి హస్తం ఉందన్న పేర్ని నాని
- కావాలంటే చెక్ పోస్టు పెట్టి తనిఖీలు చేసుకోవచ్చన్న పయ్యావుల
- చెక్ పోస్టు పెట్టుకుంటామంటే కుర్చీ, టెంట్ ఇస్తానని ఆఫర్
కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలివెళుతున్న వ్యవహారంలో అధికార కూటమి నేతలు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్నది రాష్ట్ర ఆర్థికమంత్రి వియ్యంకుడేనని తమకు సమాచారం ఉందని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపణలు చేశారు. దీనిపై రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు.
తన వియ్యంకుడి కుటుంబం మూడు తరాలుగా బాయిల్డ్ రైస్ ఎగుమతుల వ్యాపారంలో ఉందని స్పష్టం చేశారు. అయితే, తమ కుటుంబంతో వియ్యం ఏర్పరచుకున్న తర్వాత... వారు బియ్యం వ్యాపారం చేయడంలేదని వెల్లడించారు.
ఎవరికైనా అనుమానం ఉంటే చెక్ పోస్ట్ పెట్టి ప్రతి గోనె సంచి తనిఖీ చేసుకోవచ్చని పయ్యావుల అన్నారు. చెక్ పోస్టు పెట్టుకుంటానంటే కుర్చీ, టెంట్ కూడా ఏర్పాటు చేస్తానని ఆఫర్ ఇచ్చారు. రేషన్ బియ్యం తరలింపునకు, తన వియ్యంకుడి వ్యాపారానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.