Food: ఈ ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టొద్దు తెలుసా?
- కూరగాయల నుంచి మిగిలిన వంటల దాకా అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం సాధారణమే...!
- అలా చేస్తే కొన్ని రకాల ఆహారం రుచిని, నాణ్యతను కోల్పోతుందంటున్న నిపుణులు
- కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫంగస్ పెరుగుతుందని వెల్లడి
ఇంటికి తెచ్చిన కూరగాయల నుంచి... వండిన ఆహార పదార్థాల దాకా ఏది ఉన్నా, మిగిలినా వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటాం. అందులో పెడితే ఎక్కువ సమయం తాజాగా ఉంటాయనో, చెడిపోకుంటా ఉంటాయనో భావిస్తుంటాం. ఇది చాలా వరకు నిజమే అయినా... కొన్ని రకాల ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెట్టవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానివల్ల ఆ ఆహారం నాణ్యత దెబ్బతింటుందని... రుచి తగ్గిపోతుందని, కొన్నిసార్లు ఇబ్బందులు కూడా రావొచ్చని హెచ్చరిస్తున్నారు.
బంగాళదుంపలు...
ఆలు గడ్డలను శీతల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసినప్పుడు వాటిలోని పిండి (Starches) పదార్థాలు చక్కెరలు (Sugars)గా మారిపోతాయని... ఇది బంగాళ దుంపల రుచి, నాణ్యతను తగ్గించేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పైగా షుగర్స్ పెరిగిన ఆహారం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు.
టమాటాలు...
టమాటాలను అతి శీతల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తే... వాటి టెక్స్ఛర్ దెబ్బతింటుంది. ఫ్లేవర్ చెడిపోతుంది. అందువల్ల టమాటాలను కాస్త కాయలుగా ఉన్నవే తెచ్చుకుని... సాధారణంగా నిల్వ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పళ్లుగా మారినకొద్దీ వినియోగించుకోవచ్చని చెబుతున్నారు.
ఉల్లిపాయలు...
ఫ్రిడ్జ్ లో శీతల ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తే... ఉల్లిపాయలు బూజు పడతాయని, మెత్తబడిపోయి దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. పొడిగా, కాస్త చల్లగా ఉండి... బాగా గాలి ఆడే ప్రదేశంలో ఉల్లిపాయలను నిల్వ చేయాలని సూచిస్తున్నారు.
అరటి పళ్లు...
అరటి పళ్లను ఎప్పుడూ ఫ్రిడ్జ్ లో పెట్టవద్దని నిపుణులు చెబుతున్నార. దానివల్ల అరటిలోని కణ నిర్మాణం మారిపోయి, దాని రుచి, నాణ్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. సాధారణంగా బయటే... కాస్త జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలని సూచిస్తున్నారు.
బ్రెడ్...
బ్రెడ్ ను ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం వల్ల వేగంగా దెబ్బతింటుందని... ఫంగస్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వెలుతురు పడని, కాస్త చల్లగా ఉండే ప్రదేశంలో పెడితే చాలని వివరిస్తున్నారు.
- తేనెను ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్ లో పెట్టవద్దని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల తేనె గట్టిపడి, చక్కెరలు విడివడి దాని సహజ లక్షణాలు పోతాయని స్పష్టం చేస్తున్నారు.
- వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం వల్ల రబ్బర్ లా సాగిపోయే తరహాలోకి మారి రుచి తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.
- అవకాడోలను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి కణజాలం గట్టిగా అయిపోయి తినడానికి వీలు లేకుండా ఇబ్బందిగా మారుతుందని, వాటిని బయట ఉంచడమే మంచిదని వివరిస్తున్నారు.