Eknath Shinde: "షిండే మళ్లీ సీఎంగా రావాలి" అంటూ మహారాష్ట్రలో బ్యానర్లు
- మహారాష్ట్రలో ఆశ్చర్యకర రాజకీయ పరిణామాలు
- మహాయుతి కూటమి ఘనంగా గెలిచినా... సీఎం పదవి విషయంలో భిన్నాభిప్రాయాలు
- నూతన ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం
- బీజేపీ హైకమాండ్ చొరవతో ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు
- అయినప్పటికీ షిండేనే సీఎం కావాలంటూ బ్యానర్లు, హోర్డింగులు
మహారాష్ట్రలో గురువారం నాడు నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి ఓవైపు ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ, సీఎం పదవి విషయంలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే... వీలైతే మరో డిప్యూటీ సీఎంగా అజిత్ వార్... ప్రస్తుతానికి ఈ సమీకరణం ప్రచారంలో ఉంది.
బీజేపీ హైకమాండ్ చెప్పిన మాట వింటానని ఏక్ నాథ్ షిండే చెబుతున్నప్పటికీ, షిండేనే మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని బ్యానర్లు వెలిశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదొక ఆసక్తికర పరిణామం.
తాజాగా ఛత్రపతి శంభాజీ నగర్ లో షిండే బొమ్మతో భారీ బ్యానర్లు, హోర్డింగ్ లు దర్శనమిచ్చాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేనే మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలంటూ ఆ బ్యానర్లపై పేర్కొన్నారు. అంతేకాదు, షిండేను 'మరాఠా సర్దార్' అని అభివర్ణించారు.
ఔరంగాబాద్ లోని జాల్నా రోడ్ లో ఉన్న బాంబే హైకోర్టు బెంచ్ సమీపంలోనూ బ్యానర్లు కనిపించాయి. వీటిని సకల్ మరాఠా సమాజ్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ గత కొన్నాళ్లుగా మరాఠా రిజర్వేషన్ల కోసం పోరాడుతోంది.