Devendra Fadnavis: ఏక్‌నాథ్ షిండే మాతోనే ఉంటారు.. ఉండాలని అందరూ కోరుకుంటున్నారు: దేవేంద్ర ఫడ్నవీస్

Posts of CM and DCM are just technical posts says Devendra Fadnavis
  • షిండే ప్రభుత్వంలో ఉండాలని అందరూ కోరుకుంటున్నారన్న ఫడ్నవీస్
  • సీఎం, డిప్యూటీ సీఎం టెక్నికల్ పోస్టులు మాత్రమేనన్న ఫడ్నవీస్
  • తమ పాలన సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదన్న షిండే
ఏక్‌నాథ్ షిండే తమతోనే ఉంటారని మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. 'నిన్న నేను ఏక్‌నాథ్ షిండేను కలిశాను. కూటమి ప్రభుత్వంలో షిండే ఉండాలనేది మహాయుతి కార్యకర్తల అభిప్రాయమని ఆయనకు చెప్పాను. అతను మాతో (ప్రభుత్వంలో) ఉంటాడని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మేం ఇచ్చిన హామీలను అమలు చేస్తాం' అని ఫడ్నవీస్ అన్నారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాలని దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ.. తమ మహాయుతి కూటమి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం మద్దతిస్తున్న వారి సంతకాలతో లేఖ ఇచ్చామన్నారు. రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రమాణ స్వీకారం ఉండనుందన్నారు.

పదవులు టెక్నికల్ పోస్టులు మాత్రమే

ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులు కేవలం టెక్నికల్ పోస్టులు మాత్రమే అన్నారు. కానీ తామంతా మహారాష్ట్ర కోసం పని చేస్తామన్నారు. తదుపరి సమావేశంలో కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలో నిర్ణయిస్తామన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తమ కూటమిలోని శివసేన, ఎన్సీపీ గవర్నర్‌కు తెలియజేశాయన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసే వారిని ఈరోజు సాయంత్రం నిర్ణయిస్తామన్నారు. 

పాలన సువర్ణాక్షరాలతో లిఖించదగినది: ఏక్‌నాథ్ షిండే

ముఖ్యమంత్రిగా అభివృద్ధి పథంలో నడిపామని, అందుకు తనకు సంతోషంగా ఉందని ఏక్‌నాథ్ షిండే అన్నారు. మహాయుతి కూటమి ప్రభుత్వం పాలన గుర్తుండిపోయేదన్నారు. ఈ పాలన సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్నారు. తమ పాలనలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని, ఇందుకు ఆనందంగా ఉందన్నారు.

ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా... వేచి చూడాలని ఏక్ నాథ్ షిండే అన్నారు. తాము రాష్ట్రానికి ఏం చేయగలమో అంతా చేస్తామని అజిత్ పవార్ అన్నారు. తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నానన్నారు. 

బీజేపీ శాసన సభా పక్ష నేతగా ఫడ్నవీస్ ఎన్నిక

బీజేపీ శాసన సభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యారు. ఈరోజు బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. కోర్ కమిటీ భేటీ తర్వాత ముంబైలోని విధాన్ భవన్‌లో బీజేపీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపాని హాజరయ్యారు. సీఎం ఎంపికపై వారు ఎమ్మెల్యేలతో చర్చించారు. అనంతరం ఫడ్నవీస్‌ను ఎమ్మెల్యేలు శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.
Devendra Fadnavis
Eknath Shinde
BJP
Maharashtra

More Telugu News