Ongole sp: రఘురామ కృష్ణరాజు చిత్రహింసల కేసు: వైద్యులను విచారించిన ఎస్పీ
- రఘురామ చిత్ర హింసల కేసులో కీలక పరిణామం
- రఘురామకు వైద్య పరీక్షలు చేసిన గుంటూరు జీజీహెచ్ వైద్యుల బృందాన్ని విచారించిన పోలీసులు
- కేసులో అయిదో నిందితురాలిగా జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి
ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో విశ్రాంత సీఐడీ అధికారి విజయ్‌పాల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు తాజాగా గుంటూరు జీజీహెచ్ వైద్యులను విచారించారు.
ఈ కేసులో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి అయిదో నిందితురాలిగా ఉన్నారు. రఘురామను కస్టడీలో హింసించలేదంటూ వైద్యులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు నివేదిక ఇప్పించారంటూ ఆమెపై అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభావతిని పోలీసులు విచారించాల్సి ఉండగా, ఆమె ఇప్పటికే న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో నాడు రఘురామను ఆసుపత్రిలో పరీక్షించిన బృందంలో ఉన్న గుంటూరు జీజీహెచ్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంఒ) డాక్టర్ సతీశ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేంద్రతో పాటు ఈసీజీ టెక్నీషియన్ నాగరాజును పోలీసులు విచారించారు. ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ వీరిని విచారించి వివరాలను నమోదు చేసుకున్నారు.