Rohit Sharma: రేపటి నుంచి పింక్ బాల్ టెస్టు... రోహిత్ బ్యాటింగ్ స్థానం ఎక్కడ?

Team India captain Rohit Sharma clarifies on his batting position in 2nd test
  • టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్
  • కొడుకు పుట్టడంతో తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ
  • రోహిత్ స్థానంలో జట్టులోకి వచ్చి రాణించిన కేఎల్ రాహుల్
  • ఓపెనర్ గా రాహుల్ కొనసాగుతాడని రోహిత్ స్పష్టీకరణ
  • తాను మిడిలార్డర్ లో ఏదో ఒక స్థానంలో వస్తానని వెల్లడి
కొడుకు పుట్టడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. పెర్త్ లో జరిగిన ఆ మ్యాచ్ లో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలో దిగాడు. ఆ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్ లో 26, రెండో ఇన్నింగ్స్ లో 77 పరుగులతో రాణించాడు. 

ఫాస్ట్ అండ్ బౌన్సీ పిచ్ పై రాణించిన రాహుల్ ను జట్టులోంచి తప్పించే పరిస్థితి లేదు. ఇప్పుడు, రోహిత్ శర్మ రెండో టెస్టు కోసం జట్టుతో కలిశాడు. ఈ నేపథ్యంలో, జట్టులో రోహిత్ శర్మను ఏ ఆర్డర్ లో పంపాలన్నది టీమ్ మేనేజ్ మెంట్ ను ఆలోచనలో పడేసింది. దీనిపై రోహిత్ శర్మ స్వయంగా వివరణ ఇచ్చాడు. 

తొలి టెస్టులో యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్ జోడీ చక్కగా ఆడిందని, ఆ జోడీని విడదీసే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. అందుకే, తాను ఓపెనర్ స్లాట్ లో కాకుండా, మిడిలార్డర్ లో దిగుతానని రోహిత్ శర్మ వెల్లడించాడు. ఓపెనింగ్ కు అలవాటుపడిన బ్యాట్స్ మన్ కు మిడిలార్డర్ లో ఆడడం ఏమంత సులభం కాదని, కానీ జట్టు కోసం ఏం చేసేందుకైనా తాను సిద్ధమేనని అన్నాడు. 

"పెర్త్ టెస్టులో ఓపెనర్ గా దిగిన కేఎల్ రాహుల్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అందుకే బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చదల్చుకోలేదు... ఆ అవసరం కూడా కనిపించడంలేదు. భవిష్యత్తు గురించి ఇప్పుడే ఆలోచించడంలేదు. ప్రస్తుతానికి నేను మిడిలార్డర్ లో ఏదో ఒక స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాను" అని రోహిత్ శర్మ వివరించాడు. 

కాగా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపు (డిసెంబరు 6) టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇది డే/నైట్ విధానంలో పింక్ బాల్ తో జరగనుంది. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా తొలి టెస్టును గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది.
Rohit Sharma
Team India
2nd Test
Australia
Adelaide

More Telugu News