Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్

BRS MLA Padi Kaushik Reddy gets Bail

  • రెండు షూరిటీల‌తో పాటు రూ. 5వేల జ‌రిమానాతో కౌశిక్ రెడ్డికి బెయిల్
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సీఐ రాఘ‌వేంద్ర ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు
  • నిన్న కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. రాత్రి జ‌డ్జి ముందు హాజ‌రు
  • విచార‌ణ అనంత‌రం కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన న్యాయ‌మూర్తి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. రెండు షూరిటీల‌తో పాటు రూ. 5వేల జ‌రిమానాతో కౌశిక్ రెడ్డికి న్యాయ‌మూర్తి బెయిల్ ఇచ్చారు. బంజారాహిల్స్ పీఎస్‌లో త‌మ విధుల‌కు ఆటంకం క‌లిగించారంటూ సీఐ రాఘ‌వేంద్ర ఫిర్యాదు మేర‌కు కౌశిక్ రెడ్డితో పాటు ఆయ‌న 20 మంది అనుచ‌రుల‌పై కేసు న‌మోదైంది. 

దీంతో గురువారం ఉద‌యం కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లి పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆయ‌న‌ను బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఆ త‌ర్వాత ఉస్మానియా ఆసుప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం రాత్రి జ‌డ్జి ముందు హాజ‌రుప‌రిచారు. విచార‌ణ అనంత‌రం పాడి కౌశిక్ రెడ్డికి న్యాయ‌మూర్తి బెయిల్ మంజూరు చేశారు. 

కాగా, బుధ‌వారం త‌న ఫోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివ‌ధ‌ర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పీఎస్‌కు వెళ్లారు. అయితే, ఆయ‌న వెళ్లేస‌రికి ఏసీపీ అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డంతో త‌న అనుచ‌రుల‌తో క‌లిసి కౌశిక్ రెడ్డి హంగామా చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై సీఐ రాఘ‌వేంద్ర ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు అయింది. ఆ త‌ర్వాత గురువారం ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు.  

  • Loading...

More Telugu News