World's Top 100 Cities: వ‌ర‌ల్డ్‌లోనే బెస్ట్ సిటీల జాబితా.. భార‌త్ నుంచి ఒకే న‌గ‌రానికి చోటు!

Only one Indian city made it to 2024 Worlds Top 100 Cities List
  • భారతీయ నగరాల్లో ఢిల్లీకి 74వ స్థానం
  • పారిస్‌కు వ‌రుస‌గా 4వ ఏడాది అగ్రస్థానం
  • రెండో స్థానంలో మాడ్రిడ్.. టోక్యోకు మూడో ర్యాంకు
  • టాప్ 10లో రోమ్, మిలన్, న్యూయార్క్, ఆమ్‌స్టర్‌డామ్, సిడ్నీ, సింగపూర్, బార్సిలోనా
2024 ఏడాదికి గాను ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ 100 న‌గ‌రాల జాబితాను యూరోమానిట‌ర్ సంస్థ తాజాగా విడుద‌ల చేసింది. డేటా కంపెనీ లైట్‌హౌస్ భాగస్వామ్యంతో యూరోమానిటర్ ఇంటర్నేషనల్ ఈ వార్షిక నివేదిక‌ను రూపొందించింది. ఇందులో భార‌త్ నుంచి కేవ‌లం న్యూఢిల్లీ మాత్ర‌మే చోటు ద‌క్కించుకుంది. ఈ జాబితాలో ఢిల్లీకి 74వ స్థానం ద‌క్కింది. 

ఇక వ‌రుస‌గా నాలుగో ఏడాది కూడా పారిస్ న‌గ‌రం అగ్ర‌స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం విశేషం. రెండో స్థానంలో మాడ్రిడ్ నిలిస్తే.. మూడో ర్యాంకును జ‌పాన్ రాజ‌ధాని టోక్యో ద‌క్కించుకుంది. టోక్యో తర్వాత మిగిలిన టాప్ 10 నగరాలుగా రోమ్, మిలన్, న్యూయార్క్, ఆమ్‌స్టర్‌డామ్, సిడ్నీ, సింగపూర్, బార్సిలోనా ఉన్నాయి. 

ఇక ఈ జాబితాలో కైరో 100వ స్థానంలో నిలిచింది. జుహై 99వ స్థానంలో మరియు జెరూసలేం 98వ స్థానంలో ఉన్నాయి. కాగా, ఈ ర్యాంకుల‌ను నిర్ణ‌యించేందుకు మొత్తం 55 వివిధ అంశాల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్లు యూరోమానిట‌ర్ సంస్థ వెల్ల‌డించింది. 

అలాగే 1. ఆర్థిక మ‌రియు వ్యాపార పనితీరు, 2. పర్యాటక పనితీరు, 3. పర్యాటక మౌలిక సదుపాయాలు, 4. పర్యాటక విధానం మరియు ఆకర్షణ, 5. ఆరోగ్యం మరియు భద్రత, 6. స్థిరత్వం అనే ఆరు కీలక కొలమానాల ఆధారంగా నగరాల ర్యాంకుల‌ను నిర్ణ‌యించిన‌ట్లు పేర్కొంది.

కాగా, మొదటి 20 ర్యాంకింగ్‌లలో తొమ్మిది నగరాలతో యూరప్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఆరు నగరాలతో ఆసియా-పసిఫిక్ ప్రాంతం రెండో స్థానంలో ఉంటే.. ఉత్తర అమెరికాలో రెండు, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో త‌లో న‌గ‌రం, ఆస్ట్రేలియాలో రెండు న‌గ‌రాలు టాప్ 20లో చోటు ద‌క్కించుకున్నాయి.
World's Top 100 Cities
New Delhi
Paris
Madrid
Euromonitor International

More Telugu News