Komatireddy Venkat Reddy: సినిమా బెనిఫిట్ షోలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Minister Komatireddy sensational comments on cinema benefit shows

  • 'పుష్ప-2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట
  • తొక్కిసలాటలో ఒక మహిళ మృతి
  • ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమన్న కోమటిరెడ్డి

స్టార్ హీరోల సినిమాల బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు ఇస్తుండటం తెలిసిందే. అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప-2' కు కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చాయి. 

అయితే, హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోకు అనుమతులు ఇవ్వబోమని ఆయన చెప్పారు. 

నగరంలో బెనిఫిట్ షోలు వేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కోమటిరెడ్డి అన్నారు. కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేందుకు వచ్చినవారు తమ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు.  

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్ లో కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ వచ్చారు. దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి (39), ఆమె భర్త భాస్కర్, పిల్లలు శ్రీతేజ్, శాన్వికలు కూడా సినిమా చూసేందుకు వచ్చారు. బన్నీ వచ్చిన సమయంలో ఎవరూ ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది. 

ఈ తొక్కిసలాటలో రేవతి, కుమారుడు శ్రీతేజ్ ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీన్ని గమనించిన పోలీసులు ఆమెకు సీపీఆర్ చేసినా లాభం లేకపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. మహిళ మృతిపై 'పుష్ప' టీమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మృతురాలి కుటుంబానికి అండగా నిలబడతామని ప్రకటించింది.

  • Loading...

More Telugu News