Sheikh Mujibur Rahman: బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. కరెన్సీ నోట్లపై ఆ దేశ జాతిపిత బొమ్మ తొలగింపు!

Bangladesh Govt To Remove Sheikh Mujibur Rahmans Image From Currency Notes

  • కరెన్సీ నోట్లపై షేక్ ముజీబుర్ బొమ్మ తొలగించాలని నిర్ణయం
  • ఇప్పటికే నాలుగు నోట్లను కొత్త డిజైన్లతో ముద్రిస్తున్న బంగ్లాదేశ్ బ్యాంక్
  • జులై తిరుగుబాటుకు చెందిన గ్రాఫిటీతోపాటు మతపరమైన నిర్మాణాలకు నోట్లపై చోటు

బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మాన్ బొమ్మలను కరెన్సీ నోట్ల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త నోట్లను ముద్రిస్తున్న బంగ్లాదేశ్ బ్యాంక్.. షేక్ హసీనా భారత్ పారిపోవడానికి కారణమైన జులై తిరుగుబాటును ప్రతిబింబించేలా ఫొటోలను ముద్రిస్తున్నట్టు ‘ఢాకా ట్రిబ్యూన్’ పేర్కొంది. ఆగస్టు 5న షేక్ హసీనా భారత్‌కు పారిపోయిన తర్వాత దేశ మధ్యంతర ప్రభుత్వంలో చీఫ్ అడ్వైజర్‌గా నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. 

మధ్యంతర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 20, 100, 500, 1000 టాకాల నోట్లను ముద్రిస్తున్నట్టు బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అయితే, ఈ నోట్లపై బంగ్లాదేశ్ బంగబంధు (జాతిపిత) షేక్ ముజీబుర్ రెహ్మాన్ ఫొటో ఉండదని దినపత్రిక పేర్కొంది. ఈ నోట్లపై మతపరమైన నిర్మాణాలు, బెంగాలీ సంప్రదాయాలు, జులై తిరుగుబాటు సమయంలో గీసిన ‘గ్రాఫిటీ’ని చేర్చినట్టు తెలిసింది. మరో ఆరు నెలల్లో ఈ కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని బంగ్లాదేశ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హస్నీరా షేక్ తెలిపారు. ప్రస్తుతానికైనా పైన పేర్కొన్న నాలుగు నోట్ల డిజైన్ మార్చామని, దశల వారీగా మిగతా నోట్లను కూడా రీడిజైన్ చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. 

  • Loading...

More Telugu News