Pushpa 2: ముంబైలో ఆగిపోయిన 'పుష్ప-2' షో... కారణం ఇదే!

Pushpa 2 Screening Disrupted In Mumbai

  • బాంద్రాలోని గెలాక్సీ థియేటర్ లో పెప్పర్ స్ప్రే చేసిన గుర్తు తెలియని వ్యక్తి
  • ఊపిరి ఆడక అల్లాడిపోయిన ప్రేక్షకులు
  • 20 నిమిషాల పాటు ఆగిపోయిన షో

అల్లు అర్జున్, రష్మిక మందన్న, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప-2' చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి షో నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్లకు కూడా సాధ్యం కాని రీతిలో ఈ సినిమా తొలిరోజు వసూళ్లను సాధించింది. 

మరోవైపు, ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ముంబై బాంద్రాలోని గెలాక్సీ థియేటర్ లో పెప్పర్ స్ప్రే కలకలం రేపింది. ఇంటర్వెల్ కు ముందు గుర్తు తెలియని వ్యక్తి పెప్పర్ స్ప్రే చేశాడు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చాలా మంది దగ్గుతూ బయటకు పరుగులు తీశారు. దీంతో, సినిమా నిర్వాహకులు దాదాపు 20 నిమిషాల పాటు షోను ఆపేశారు. పెప్పర్ స్ప్రే ఘాటును తొలగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత షోను కొనసాగించారు.

ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యంతో పాటు కొందరు ప్రేక్షకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానం ఉన్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. 'పుష్ప-2'పై అక్కసుతోనే కొందరు ఇలా చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News