Sandhya Theater Incident: సంధ్య థియటర్ వద్ద మహిళ మృతిపై ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు
- డిసెంబరు 4వ తేదీ రాత్రి హైదరాబాదులో పుష్ప-2 ప్రీమియర్ షో
- సంధ్య థియేటర్ వద్దకు వచ్చిన అల్లు అర్జున్
- భారీ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి
- తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు
- రూ.5 కోట్ల పరిహారం ఇప్పించాలన్న న్యాయవాది రవికుమార్
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్దకు హీరో అల్లు అర్జున్ రావడం... భారీ తొక్కిసలాట జరిగి రేవతి (39) అనే మహిళ మృతి చెందడం తెలిసిందే. తాజాగా, ఈ ఘటనపై ఎన్ హెచ్ఆర్సీ(జాతీయ మానవ హక్కుల సంఘం)కి ఫిర్యాదు అందింది.
పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ప్రీమియర్ షో వేశారని... ఈ సినిమా హీరో అల్లు అర్జున్ పైనా, అధికారులపైనా చర్యలు తీసుకోవాలంటూ రవికుమార్ అనే న్యాయవాది ఎన్ హెచ్ఆర్సీకి విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదును ఎన్ హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది.
కాగా, సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని, తొక్కిసలాట జరగకుండా కట్టడి చేయలేకపోయిందని న్యాయవాది రవికుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించిందని, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వివరించారు. మహిళ కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని రవికుమార్ ఎన్ హెచ్ఆర్సీని కోరారు.