National Awards: నాలుగు జాతీయ అవార్డులు దక్కించుకున్న ఏపీ
- వివిధ అంశాల్లో చూపిన పనితీరు ఆధారంగా అవార్డులు
- నాలుగు కేటగిరీల్లో అవార్డులకు ఎంపికైన నాలుగు గ్రామాలు
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్న సర్పంచ్ లు
ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు గ్రామ పంచాయతీలు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నాయి. వివిధ అంశాల్లో చూపిన అద్భుత పనితీరుకు సంబంధించి ఈ అవార్డులను ప్రకటించారు. 'సంతృప్తికర తాగునీరు' కేటగిరీలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి గ్రామం, 'ఆరోగ్యకర' కేటగిరీలో చిత్తూరు జిల్లా ఐరాల మండలం బొమ్మసముద్రం గ్రామం, 'సామాజిక భద్రత' కేటగిరీలో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామం, 'పచ్చదనం పరిశుభ్రత' కేటగిరీల్లో అనకాపల్లి జిల్లా తగరం పూడి గ్రామం జాతీయ అవార్డులకు ఎంపికయ్యాయి.
2022-23లో చూపిన పనితీరు ఆధారంగా ఈ అవార్డులను ప్రకటించారు. అవార్డుల కార్యక్రమం ఈనెల 11న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరగనుంది. అవార్డులు గెలుచుకున్న ఆయా గ్రామాల సర్పంచ్ లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెమెంటోతో పాటు, రూ. కోటి చొప్పున నగదును బహుమతిగా అందుకోనున్నారు.