Israel: ఎలాన్ మస్క్‌తో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ కీలక చర్చలు!
- ఎలాన్ మస్క్‌కు ఫోన్ చేసిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్
- మిలిటెంట్ల చెరలోని తమ బందీల విడుదలకై కీలక చర్చలు
- బందీలుగా ఉన్న కుటుంబ సభ్యుల అభ్యర్ధన మేరకే మస్క్‌తో ఐజాక్ మాట్లాడినట్లు ఇజ్రాయెల్ వర్గాల వెల్లడి
ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ కార్యవర్గంలో డోజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్‌తో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఫోన్‌లో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హమాస్ చెరలోని తమ బందీల విడుదలపై చర్చల పునరుద్ధరణ గురించి చర్చించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
బందీలుగా ఉన్న కుటుంబ సభ్యుల అభ్యర్ధన మేరకే మస్క్‌తో ఐజాక్ చర్చించారని వెల్లడించారు. అన్ని పక్షాలపై ఒత్తిడి తీసుకొచ్చేలా సంధిని ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరినట్లు తెలిపాయి. మరో వైపు ..మిలిటెంట్ల చెరలోని బందీలను త్వరగా విడుదల చేయించాలనే ఆలోచనలో డొలాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు. ఆ క్రమంలోనే తాను అధికారిక బాధ్యతలు చేపట్టేలోపు వారిని విడుదల చేయకపోతే నరకం చూపిస్తానని హమాస్‌కు హెచ్చరికలు జారీ చేశారు.
ఇజ్రాయెల్‌పై గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ దాడి చేయడంతో సుమారు 1,200 మందికి పైగా మృతి చెందారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాలోకి తీసుకువెళ్లింది. మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు బందీలు విడుదలయ్యారు. తర్వాత పలు ఘటనల్లో మరి కొందరు మృతి చెందగా, ప్రస్తుతం 51 మంది మాత్రం సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడిస్తోంది.