Cricket: ఇంగ్లండ్ సంచలన ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి

England became the first team to score 500000 runs in Test cricket
  • టెస్టు క్రికెట్‌లో 5 లక్షల పరుగులు సాధించిన తొలి జట్టుగా అవతరణ
  • 4.28 లక్షల పరుగులతో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా
  • భారీ వ్యత్యాసంతో మూడవ స్థానంలో ఉన్న టీమిండియా
వెల్లింగ్‌టన్ వేదికగా ఆతిథ్య దేశం న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అదరగొడుతోంది. సీనియర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతో పాటు బౌలర్లు కూడా సమష్టిగా ఆకట్టుకోవడంతో మ్యాచ్‌ రెండవ రోజు పూర్తయ్యే సమయానికే మ్యాచ్‌పై ఇంగ్లండ్ తిరుగులేని పట్టు సాధించింది. ఇంగ్లండ్ రెండవ ఇన్నింగ్స్‌లో 378/5 స్కోరు పటిష్ఠమైన స్థితిలో ఉంది. 

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 280 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఆతిథ్య జట్టు కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌తో కలుపుకొని ఇంగ్లాండ్ ఏకంగా 533 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూడవ రోజు కూడా కొన్ని పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది. దీంతో కివీస్ ముందు కొండంత లక్ష్యం ఉండడం ఖాయమైంది.

ఇదిలావుంచితే.. రెండవ రోజైన శనివారం ఆట ముగిసే సమయానికి బెన్ స్టోక్స్ సారధ్యంలోని ఇంగ్లండ్ జట్టు సరికొత్త రికార్డు నెలకొల్పింది. టెస్ట్ ఫార్మాట్ క్రికెట్‌లో మొత్తం 5 లక్షల పరుగులు చేసిన తొలి జట్టుగా అవతరించింది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ మైలురాయిని సాధించిన తొలి క్రికెట్ జట్లు ఇంగ్లాండ్ కావడం విశేషం. ఇంగ్లండ్‌ జట్టుకు ఇది 1,082వ టెస్టు కావడం గమనార్హం. ఇక 4,28,868 పరుగులతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. 2,78,751 టెస్ట్ పరుగులు సాధించిన భారత్ భారీ వ్యత్యాసంతో ఈ జాబితాలో మూడవ స్థానంలో కొనసాగుతోంది.

కాగా వెల్లింగ్‌టన్‌ టెస్టు మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు అదరగొట్టారు. నలుగురు బ్యాటర్లు 50కి పైగా స్కోర్లు సాధించారు. డకెట్ 92, జాకబ్ 96, హ్యారీ బ్రూక్ 55, జో రూట్ 73 (నాటౌట్) పరుగులు సాధించారు. రూట్‌తో పాటు బెన్‌స్టోక్స్ 35 పరుగులతో (నాటౌట్) క్రీజులో ఉన్నాడు. ఇక కివీస్ జట్టు 533 పరుగులకు పైగా లక్ష్యాన్ని సాధించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. గత చరిత్రను పరిశీలిస్తే... నాలుగవ ఇన్నింగ్స్ లో అత్యధికంగా 274 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఆ జట్టు సాధించగలిగింది. 2003లో పాకిస్థాన్‌పై ఈ లక్ష్యాన్ని ఛేదించింది.
Cricket
Sports News
Team England
England Vs New Zealand

More Telugu News