Mohammed Siraj: కోపంతో బంతిని లబుషేన్‌ వైపు విసిరికొట్టిన మహ్మద్ సిరాజ్.. వీడియో ఇదిగో

Mohammed Siraj  fumed at Labuschagne and threw ball for pulling away at the last moment

  • బంతి సంధించే సమయంలో పక్కకు తప్పుకున్న మార్నస్ లబుషేన్
  • చిర్రెత్తుకొచ్చి బంతిని విసిరికొట్టిన భారత పేసర్
  • బ్యాట్ అడ్డు పెట్టిన మార్నస్ లబుషేన్

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో కాస్త వీక్ అనే చెప్పాలి. మైదానంలో ఆగ్రహానికి గురికావడం, భావోద్వేగాలకు లోనైన పలు సందర్భాలే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అలాంటి ఘటనే మరొకటి జరిగింది. అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో సిరాజ్ చిర్రెత్తుకొచ్చింది. తాను బౌలింగ్ చేస్తున్న సమయంలో.. పరిగెత్తుకొచ్చి ఒక బంతిని సంధించే చివరి క్షణంలో క్రీజులో ఉన్న ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ అకస్మాత్తుగా పక్కకు జరగడమే ఇందుకు కారణమైంది.  దీంతో కోపాన్ని అదుపు చేసుకోలేక సిరాజ్ బంతిని లబుషేన్‌ వైపు విసిరికొట్టాడు. షాక్‌కు గురైన లబుషేన్ బ్యాట్ అడ్డుపెట్టాడు. 

నిజానికి లబుషేన్ క్రీజు నుంచి పక్కకు తప్పుకోవడానికి అనివార్యమైన కారణం ఒకటి ఉంది. బంతిపై బ్యాట్స్‌మెన్ల దృష్టి మరల్చకుండా ఎదురుగా ఏర్పాటు చేసే నల్లటి తెర వద్ద ఓ వ్యక్తి కదలాడాడు. దీంతో లబుషేన్ ఏకాగ్రత దెబ్బతిని పక్కకు తప్పుకున్నాడు. టీవీ రీప్లేలో ఈ విషయం స్పష్టమైంది. అయితే అసలు విషయం తెలియక సిరాజ్ తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25వ ఓవర్‌లో ఈ పరిణామం చేసుకుంది. ఆ ఓవర్ చివరి బంతి సమయంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ రెండవ రోజు ఆసక్తికరంగా సాగుతోంది. ఆట 70 ఓవర్లు ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు  5 వికెట్లు 251 పరుగులు సాధించింది. ఇప్పటివరకు భారత్‌పై 71 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

  • Loading...

More Telugu News