YS Sharmila: జగన్ తో పాటు అదానీని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా?: షర్మిల

Sharmila comments on AP govt

  • సోలార్ విద్యుత్ ఒప్పందాలపై విచారణ ఎందుకు జరపడం లేదని షర్మిల ప్రశ్న
  • జగన్ లంచాలు తీసుకున్నారని అమెరికా దర్యాప్తు సంస్థలు నివేదికలు ఇచ్చాయని వ్యాఖ్య
  • ఈ ముడుపుల అంశంపై ఫాస్ట్ ట్రాక్ విచారణ జరపాలని డిమాండ్

ఏపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శలు గుప్పించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం సిట్ వేయడం సంతోషకరమైన విషయమని ప్రశంసించిన షర్మిల... వైసీపీ హయాంలో సోలార్ విద్యుత్ ఒప్పందాలలో జరిగిన రూ. 1,750 కోట్ల ముడుపులపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ... అదానీ అక్రమ ఒప్పందాలపై ఎందుకు పెట్టడం లేదని అడిగారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా? అని ప్రశ్నించారు. 

సీఎం జగన్ లంచాలు తీసుకున్నారని అమెరికా దర్యాప్తు సంస్థలు నివేదిక ఇచ్చాయని... నిజాలను నిగ్గు తేల్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై మౌనం వహిస్తున్నారని... విచారణ చేయకుండా ఉంటున్నారని విమర్శించారు. జగన్ తో పాటు అదానీని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు.

సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో భారీ అవినీతి ఉందని టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించిందని... పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని ఆనాడు మీరు అనలేదా? అని ప్రశ్నించారు. గుజరాత్ లో రూ. 1.99కి దొరికే సౌర విద్యుత్ ను గత ప్రభుత్వం రూ. 2.49కి ఎలా కొనుగోలు చేసిందంటూ టీడీపీ ఉద్యమాలు చేసిందని గుర్తు చేశారు. 

ఈ డీల్ ను రద్దు చేయాలని కోరుతూ ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో హైకోర్టులో కేసు కూడా వేయించారని షర్మిల అన్నారు. అదానీకి జగన్ అమ్ముడుపోయారని... దీనిపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. ముడుపుల వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించాలని... సోలార్ పవర్ డీల్ ను వెంటనే రద్దు చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News