DK Aruna: సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రవ్యాఖ్యలు

DK Aruna hot comments on CM Revanth Reddy

  • రేవంత్ రెడ్డి లక్కీ సీఎం అని ఎద్దేవా
  • సీఎం కనీసం తన పదవికైనా గౌరవం తెచ్చేలా ప్రవర్తించాలని సూచన
  • ఏడాదైనా ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని విమర్శ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత, మహబూబ్ నగర్ లోక్ సభ సభ్యురాలు డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి లక్కీ లాటరీ సీఎం అని ఎద్దేవా చేశారు. సీఎం కనీసం ఆ పదవికైనా గౌరవం తెచ్చేలా ప్రవర్తించాలన్నారు. ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశమిచ్చారని, కానీ ఈ మార్పు చూసిన తర్వాత ఎందుకు అధికారం ఇచ్చామా? అని ప్రజలు బాధపడుతున్నారని మండిపడ్డారు.

గతంలో ఓ ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడినందుకే ప్రజలు గద్దె దింపారన్నారు. తాను తిట్టకుంటే కేసీఆర్ కంటే తక్కువ అయిపోతానని... ముఖ్యమంత్రిని అనిపించుకోనని భావించి రేవంత్ అంతకంటే ఎక్కువగా తిడుతున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా ఆయన ప్రధాని మోదీని, కేంద్రాన్ని, కేంద్రమంత్రులు టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది సంబరాలు చేసుకుంటోందని, కానీ ఏం చేశారని ఈ విజయోత్సవాలని ప్రశ్నించారు. నిరుద్యోగులకు భృతి... మహిళలకు రూ.2,500... ఆడపిల్లలకు స్కూటీ... ఇలా ఏ వాగ్దానం అమలు చేశారో చెప్పాలన్నారు. హామీలు ఎందుకు అమలు చేయడం లేదని తాను ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నేతలు తనను టార్గెట్ చేస్తున్నారన్నారు.

  • Loading...

More Telugu News