Budda Venkanna: విజయసాయిరెడ్డిపై బెజవాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన బుద్ధా వెంకన్న

Budda Venkanna complains against Vijayasai Reddyto Vijayawada police
  • చంద్రబాబుపై విజయసాయి వ్యాఖ్యలు చేశారన్న బుద్ధా
  • విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును కలిసి ఫిర్యాదు
  • పోలీసులు చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళతామని స్పష్టీకరణ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలని సీపీని కోరామని బుద్ధా వెంకన్న వెల్లడించారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. 

కాకినాడ పోర్టు అంశాన్ని తప్పుదారి పట్టించేందుకు విజయసాయి మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. స్కాంలో ఇరుక్కున్న జగన్ జైలుకు వెళతారని తెలియడంతో విజయసాయి ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు విజయసాయిలోని ఉన్మాదానికి పరాకాష్ఠ అని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 

గత ఐదేళ్లలో వైసీపీ నేతలు లెక్కకు మిక్కిలిగా దారుణాలకు పాల్పడ్డారని, వారి బాధితులు ఇప్పుడు పోలీసులకు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. కేవీ రావు కూడా అలాగే పోలీసులకు ఫిర్యాదు చేస్తే, కులం అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ తప్పులను ఎత్తిచూపితే కులం పేరుతో కుట్రలు చేస్తారా? అని మండిపడ్డారు.
Budda Venkanna
Vijayasai Reddy
Police
Vijayawada
TDP
YSRCP

More Telugu News