G Jagadish Reddy: అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు... కాంగ్రెస్ మాత విగ్రహం: జగదీశ్ రెడ్డి
- ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
- ఆ విగ్రహం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెట్టుకుంటే బాగుంటుందన్న జగదీశ్ రెడ్డి
తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ డిసెంబరు 9న రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సమాయత్తమవుతుండగా... విపక్ష బీఆర్ఎస్ మాటల దాడికి దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహం కాదని... అది కాంగ్రెస్ మాత విగ్రహం అని బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి విమర్శించారు.
ఈ విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని... కావాలంటే ఆ విగ్రహాన్ని మీ పార్టీ ఆఫీసులో పెట్టుకోండి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఉద్యమకారులు, సాంస్కృతికవాదులు, శిల్పులు, అన్ని వర్గాల ప్రజల ఆలోచనల మేరకు నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్టు జగదీశ్ రెడ్డి తెలిపారు. ఎవరైనా సరే తల్లి గొప్పగా, గౌరవంగా, ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారని... మనం పేదలమా, ఉన్నవాళ్లమా అని కాదు... ఎవరి అమ్మ వాళ్లకు గొప్ప అని స్పష్టం చేశారు. ఆ తల్లి ఉన్నతంగా ఉండాలని, ఆ తల్లి తలపై కిరీటం ఉండాలని కోరుకుంటామని వివరించారు.
"ఆ అమ్మ మనల్ని కని, గొప్పవాళ్లను చేసినందుకు గుర్తుగా ఆ కిరీటం ఉండాలని కోరుకుంటాం. కానీ ఇవాళ మీరు పెట్టుకుంటున్నది మీ కాంగ్రెస్ తల్లి విగ్రహం మాత్రమే. కాబట్టి ఆ విగ్రహాన్ని మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనే పెట్టుకోండి. అంతేతప్ప, ప్రజల ఆస్తి అయిన సెక్రటేరియట్ లో ఆ విగ్రహం పెట్టడానికి వీల్లేదు. ఆ కార్యక్రమం కాంగ్రెస్ మాత విగ్రహావిష్కరణగానే భావిస్తున్నాం. ప్రజలు కూడా అలాగే భావిస్తారని అనుకుంటున్నాం" అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.