Under-19 Asia Cup: టీమిండియాకు తీవ్ర నిరాశ... అండర్-19 ఆసియా కప్ విజేత బంగ్లాదేశ్
- యూఏఈ వేదికగా అండర్-19 ఆసియా కప్
- నేడు దుబాయ్ లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫైనల్
- 59 పరుగుల తేడాతో భారత్ ను ఓడించిన బంగ్లాదేశ్
- 199 పరుగుల లక్ష్యఛేదనలో 139 పరుగులకే కుప్పకూలిన భారత్
భారీ విజయాలతో అండర్-19 ఆసియా కప్ లో ఫైనల్ చేరిన టీమిండియా టైటిల్ పోరాటంలో విఫలమైంది. ఇవాళ బంగ్లాదేశ్ జట్టుతో దుబాయ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత యువ జట్టు ఓటమిపాలైంది. టాస్ ఓడినప్పటికీ, మెరుగైన ఆటతీరు కనబర్చిన బంగ్లాదేశ్ జట్టు 59 పరుగుల తేడాతో విజయం సాధించి, ఆసియా కప్ ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 49.1 ఓవర్లలో 198 పరుగులు చేయగా.... 199 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 35.2 ఓవర్లలో 139 పరుగులకే చేతులెత్తేసింది. భారత అండర్-19 జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా సాగుతున్న దాఖలాలు కనిపించలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా పయనించింది.
టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ మహ్మద్ అమాన్ చేసిన 26 పరుగులకే అత్యధికం. ఆఖర్లో హార్దిక్ రాజ్ 24 పరుగులు చేయడంతో టీమిండియాకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. కేపీ కార్తికేయ 21, ఆండ్రీ సిద్ధార్థ్ 20 పరుగులు చేశారు.
ఓపెనర్లు వైభవ్ సూర్యవంశి (9), ఆయుష్ మాత్రే (1) విఫలం కావడం భారత జట్టు అవకాశాలను దెబ్బతీసింది. మిడిలార్డర్ లో నిఖిల్ కుమార్ (0) డకౌట్ కాగా... వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ హర్వన్ష్ సింగ్ 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. బంగ్లా బౌలర్లలో ఇక్బాల్ హుస్సేన్ ఇమాన్ 3, కెప్టెన్ అజీజుల్ హకీమ్ తమీమ్ 3, అల్ ఫహాద్ 2, మారూఫ్ మృదా 1, రిజాన్ హసన్ 1 వికెట్ తీశారు.