SI: వాజేడు ఎస్సై ఆత్మహత్య ఘటనపై ఆయన ప్రియురాలు ఏం చెప్పారంటే..!

Twist in SI suicide

  • ఇన్స్టాగ్రామ్ ద్వారా తమకు పరిచయం ఏర్పడిందన్న యువతి
  • ఆయనే తొలుత పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారని వెల్లడి
  • ఆయన సోదరుడి సమక్షంలోనే పెళ్లి గురించి మాట్లాడామన్న యువతి

ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హరీశ్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఓ యువతి ఆయన వద్ద ఉన్నారు. హరీశ్ తో తనకు ఉన్న సంబంధంపై ఆమె పూర్తి వివరాలను వెల్లడించారు. ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా తమకు పరిచయం ఏర్పడిందని... కొన్ని రోజుల తర్వాత ఆయన ఎస్సై అని తెలిసిందని... దీంతో, గతంలో తనను కొందరు మోసం చేసిన విషయాన్ని, కేసు వివరాలను తెలిపి ఆయన సాయం కోరానని తెలిపింది. ఆ తర్వాత తమ పరిచయం ప్రేమకు దారి తీసిందని చెప్పింది. 

హరీశే తొలుత పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారని... తనకు కొత్త జీవితాన్ని ఇస్తానని చెప్పారని సదరు యువతి తెలిపింది. మన పెళ్లి జరగాలంటే పోలీసు ఉన్నతాధికారుల ఎదుటైనా, పోలీస్ స్టేషన్ ముందైనా, తన ఇంటి వద్దనైనా ధర్నా చేయాలని చెప్పారని వెల్లడించింది. ఆత్మహత్యకు ముందు రోజు తాము ప్రైవేట్ రిసార్టులో కలిశామని... తమ మధ్య గొడవ జరగలేదని చెప్పింది. 

హరీశ్ సోదరుడి సమక్షంలోనే తాము పెళ్లి గురించి మాట్లాడుకున్నామని తెలిపింది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోతే ఎవరి జీవితం వాళ్లు గడిపేద్దామని కూడా చెప్పారని వెల్లడించింది. డబ్బు కోసం తాను బ్లాక్ మెయిల్ చేయలేదని తెలిపింది. హనుమకొండలో పెళ్లి చేసుకుందామని ఆయన చెప్పారని... ఆ తర్వాత వాహనం వద్దకు వెళ్లాలని తనకు చెప్పారని... అనంతరం గడియ పెట్టుకుని తుపాకీతో కాల్చుకున్నారని చెప్పింది. అయితే, ఆరోజు తనను మీడియాతో మాట్లాడకుండా పోలీసులు దూరంగా తీసుకెళ్లారని తెలిపింది. ఈ మేరకు ఆమె ఓ న్యూస్ ఛానల్ కు ఫోన్ చేసి వివరాలు వెల్లడించింది.

  • Loading...

More Telugu News