Sonia Gandhi: జార్జ్ సోరోస్‌తో సోనియా గాంధీకి సంబంధాలు.. బీజేపీ సంచలన ఆరోపణలు

BJP claimed foreign influence in Indian politics and cites link between Congress and George Soros

  • కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా పరిగణించే ఫౌండేషన్‌తో సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపణలు
  • భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ సంస్థల ప్రమేయంగా అభివర్ణన 
  • కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ

కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీలపై కేంద్రంలోని అధికార బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌ ఆర్థిక సాయం అందిస్తున్న గ్రూపుతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణాస్త్రాలు సంధించింది. భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేయాలనే ఆలోచనలకు ఆ సంస్ధ మద్దతిస్తోందని, సోరోస్ ఫౌండేషన్‌తో కాంగ్రెస్ సంబంధాలు పెట్టుకోవడం భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ సంస్థల ప్రభావాన్ని చూపుతోందని బీజేపీ అభివర్ణించింది. దేశాన్ని అస్థిర పరచాలనుకునే సంస్థలకు కాంగ్రెస్ మద్దతిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా బీజేపీ ఆదివారం వరుసగా పోస్టులు పెట్టింది.

ఎఫ్‌డీఎల్-ఏపీ ఫౌండేషన్‌కు (ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్) కో-ప్రెసిడెంట్‌గా ఉన్న సోనియా గాంధీ.. జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం పొందే సంస్థతో సంబంధాలు పెట్టుకున్నారని బీజేపీ ఆరోపించింది. కశ్మీర్‌ను ప్రత్యేకంగా పరిగణిస్తున్నట్టు ఎఫ్‌డీఎల్-ఏపీ ఫౌండేషన్ ఇదివరకే స్పష్టమైన అభిప్రాయాన్ని తెలిపిందని పేర్కొంది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు సోనియా గాంధీ అధ్యక్షురాలిగా కొనసాగుతుండడంతో జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి దారితీసిందని బీజేపీ పేర్కొంది.

భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు దేశంలో విపక్ష పార్టీతో సోరోస్ ఫౌండేషన్, మీడియా పోర్టల్ ఓసీసీఆర్‌ఫ్ జతకట్టాయని ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. ఈ అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని తాను 10 ప్రశ్నలు అడుగుతానని నిషికాంత్ దూబే చెప్పారు. జార్జ్ సోరోస్‌ తనకు పాత స్నేహితుడని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ బహిరంగంగా అంగీకరించారని, ఇది గమనించాల్సిన విషయమని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News