Revanth Reddy: చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలి: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి

Revanth Reddy speaks about Telangana Thalli in Assembly
  • తెలంగాణను ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అన్న రేవంత్
  • 4 కోట్ల ప్రజల భావోద్వేగం తెలంగాణ తల్లి అని వ్యాఖ్య
  • చాకలి ఐలమ్మ, సమ్మక్క, సారలమ్మల స్ఫూర్తితో విగ్రహాన్ని రూపొందించామని వెల్లడి
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి, కోట్లాది ప్రజల ఆంకాంక్షలను సోనియాగాంధీ నెరవేర్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మన దశాబ్దాల కలను నెరవేర్చిన గొప్ప నాయకురాలు సోనియా అని కితాబునిచ్చారు. సోనియా 78వ జన్మదినం సందర్భంగా ఆమెకు తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 9 తెలంగాణకు పర్వదినమని... 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రకటన వచ్చిందని ఆయన చెప్పారు. నా తెలంగాణ... కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలు సత్యమని అన్నారు. ఏ జాతికైనా ఆ జాతి అస్తిత్వమే గుర్తింపు అని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ పోరాటంలో సకల జనులను ఏకం చేసింది తెలంగాణ తల్లి అని రేవంత్ అన్నారు. ప్రజలను నిరంతరం చైతన్యపరిచి, లక్ష్యసాధన వైపు నడిపిన తల్లి తెలంగాణ తల్లి అని చెప్పారు. తెలంగాణ తల్లికి గుర్తింపు లేదని... ప్రజాపోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. 

తెలంగాణ తల్లి అంటే కేవలం భావన మాత్రమే కాదని... 4 కోట్ల ప్రజల భావోద్వేగం అని రేవంత్ అన్నారు. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విగ్రహానికి రూపకల్పన చేశామని తెలిపారు. చాకలి ఐలమ్మ, సమ్మక్క, సారలమ్మల స్ఫూర్తితో విగ్రహాన్ని రూపొందించామని చెప్పారు. 

ప్రశాంత వదనంతో, సంప్రదాయ కట్టుబొట్టుతో విగ్రహాన్ని తీర్చిదిద్దామని తెలిపారు. గుండుపూసలు, ముక్కుపుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో విగ్రహాన్ని తయారు చేశామని చెప్పారు. వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్నలు తల్లి చేతిలో కనిపించేలా చేశామని చెప్పారు. పీఠంలోని నీలి రంగు... గోదావరి, కృష్ణమ్మల గుర్తులని అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలని ఆకాంక్షించారు. 
Revanth Reddy
Sonia Gandhi
Congress
Telangana Thalli

More Telugu News