K Kavitha: తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారు: రేవంత్ రెడ్డిపై కవిత ఆగ్రహం
- తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందన్న కవిత
- బతుకమ్మను మాయం చేయడం విడ్డూరమన్న కవిత
- తెలంగాణ తల్లికి నివాళులర్పించే అర్హత సీఎంకు లేదని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను మాయం చేయడం విడ్డూరమన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం బతుకమ్మను మాయం చేయడం ద్వారా తెలంగాణ ప్రత్యేకత లేకుండా చేశారన్నారు. తెలంగాణ తల్లికి నివాళులర్పించే అర్హత ముఖ్యమంత్రికి లేదన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి సంచలన వ్యాఖ్యలు
ఈరోజు జరుగుతోంది తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కాదని... కాంగ్రెస్ పార్టీ తల్లి విగ్రహావిష్కరణ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ తల్లి మన అస్తిత్వం చాటేలా ఉండాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం అలా లేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పేదరాలిగా రూపొందించారని, అలా ఉండాలని ఎవరూ కోరుకోరన్నారు.
శిల్పశాస్త్రం ప్రకారం ఉండాల్సిన లక్షణాలన్నీ కేసీఆర్ హయాంలో రూపొందించిన విగ్రహంలోనే ఉన్నాయన్నారు. బీదరికం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలా? కోహినూర్ వజ్రం లభించిన ఈ నేలలో తెలంగాణ తల్లికి విగ్రహం ఉండకూడదా? అని ప్రశ్నించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ పాడిన ఈ నేల తల్లి మెడలో రత్నాలు ఉండవద్దా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మీద అక్కసుతో విగ్రహాన్ని మార్చి, బతుకమ్మ లేకుండా తెలంగాణ మహిళా లోకాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.