G Jagadish Reddy: అదానీ-రేవంత్ రెడ్డి ఉన్న టీ షర్ట్ వేసుకొని వెళితే తప్పేమిటి: జగదీశ్ రెడ్డి
- సమావేశాలు సజావుగా జరగకుండా పాలకపక్షం కుట్ర పన్నిందని ఆరోపణ
- రాహుల్ గాంధీ కూడా అదానీ-మోదీ టీ షర్ట్ ధరించి పార్లమెంట్‌కు వెళ్లారని వ్యాఖ్య
- కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వచ్చిందన్న జగదీశ్ రెడ్డి
తాము అదానీ-రేవంత్ రెడ్డి ఉన్న టీ-షర్ట్ వేసుకెళితే తప్పేమిటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా పాలకపక్షం కుట్ర పన్నిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను సభకు రాకుండా చేయాలని కుట్ర చేసిందన్నారు. అందుకే తమను అసెంబ్లీ బయటే అడ్డగించారన్నారు. ఇదివరకు ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు.
మేం ఏ దుస్తులు వేసుకోవాలో స్పీకర్ చెబుతారా? అని నిలదీశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో నిత్యం అదానీ మీదే మాట్లాడుతున్నారని... ఇక్కడేమో రేవంత్-అదానీ గురించి మాట్లాడవద్దని అంటారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ కూడా అదానీ-మోదీ ఉన్న టీషర్ట్ ధరించి పార్లమెంట్‌కు వెళ్లారని గుర్తు చేశారు. మరి తమను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు.
తాము రాహుల్ గాంధీనే అనుసరించామని తెలిపారు. అసెంబ్లీని రేవంత్ రెడ్డి నడుపుతున్నారా? స్పీకర్, చైర్మన్ నడుపుతున్నారా? అని నిలదీశారు. కేసీఆర్ దీక్ష వల్లనే డిసెంబర్ 9న తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయం కోదండరాంకు కూడా తెలుసని వెల్లడించారు. తెలంగాణను అదానీకి దోచిపెట్టే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ, లగచర్లలో పరిశ్రమలు అదానీ కోసమే అన్నారు.