Fire Accident: ఢిల్లీలో అగ్నిప్రమాదం... విద్యార్థులు తప్పించుకున్న తీరు వైరల్

Students escaped unhurt from fire accident in Delhi
  • రాజౌరీ గార్డెన్ లో ఓ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం
  • రెస్టారెంట్ పక్కనే ఓ కోచింగ్ ఇన్ స్టిట్యూట్
  • ఒక బిల్డింగ్ మీద నుంచి మరో బిల్డింగ్ మీదికి దూకిన విద్యార్థులు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి రాజౌరీ గార్డెన్ మార్కెట్ లోని జంగిల్ అంబోరీ రెస్టారెంట్ లో మంటలు చెలరేగి, కొద్దిసేపట్లోనే తీవ్ర రూపు దాల్చాయి. పక్కనే ఓ కోచింగ్ ఇన్ స్టిట్యూట్ ఉండగా, అందులోని విద్యార్థులు అగ్నిప్రమాదం నుంచి తప్పించుకున్న తీరు వైరల్ అయింది. 

ఒక బిల్డింగ్ మీద నుంచి మరో బిల్డింగ్ మీదకు దూకుతూ వారు సురక్షితంగా బయటపడ్డారు. ఓవైపు మంటలు అంతకంతకు ఎక్కువవుతుండగా, స్టూడెంట్లు ఎంతో రిస్క్ తీసుకుని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 

కాగా, జంగిల్ అంబోరీ రెస్టారెంట్లో ఈ మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించింది. రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటన్నది తెలియరాలేదు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి మోస్తరు గాయాలు కాగా, ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. 

అగ్నిప్రమాదం కారణంగా రాజౌరీ గార్డెన్ ప్రాంతమంతా పొగతో నిండిపోవడంతో, స్థానికులు ఇబ్బంది పడ్డారు. కాగా, ఈ అగ్నిప్రమాదం, విద్యార్థులు సురక్షితంగా బయటపడడం తాలూకు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విరివిగా దర్శనమిస్తున్నాయి.
Fire Accident
New Delhi
Restaurant
Students
Institute

More Telugu News