KTR: మేడ్చల్ మల్కాజ్‌గిరిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
- తెలంగాణను సాధించినవాడిగా కేసీఆర్, ద్రోహిగా రేవంత్ చరిత్రలో నిలిచిపోతారన్న కేటీఆర్
- తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందన్న మాజీ మంత్రి
- తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేశారని ఆగ్రహం
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని గండిమైసమ్మ సమీపంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, పార్టీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు.
విగ్రహావిష్కరణ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణను సాధించిన వాడిగా కేసీఆర్, తెలంగాణ ద్రోహిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఉక్కు సంకల్పంతో దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందని మండిపడ్డారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేశారంటే అస్తిత్వం మాయం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ఈ రోజు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ తల్లి విగ్రహమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ రూపొందించిన ఈ కొత్త నమూనా విగ్రహంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయన్నారు. దేవత రూపంలో ఉన్న తెలంగాణ తల్లి స్థాయిని తగ్గించి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పుట్టిన గడ్డను తల్లిగా చూసుకునే సంస్కృతి మనది అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో కవులు, కళాకారులు, శిల్పుల సారథ్యంలో సమష్టి కృషితో తెలంగాణ తల్లి ఆవిర్భవించిందన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ సంస్కృతిని అవమానించారని, అలాంటి వారికి దీటుగా సమాధానం చెబుతామన్నారు. తెలంగాణకు బతుకమ్మ ప్రత్యేకమని, అలాంటి బతుకమ్మతో మనం తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామన్నారు. తల్లులను మార్చే దుర్మార్గులు ప్రపంచంలో ఎక్కడా లేరని ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలి కానీ తల్లులు కాదని వ్యాఖ్యానించారు.