Vodafone Idea: వొడాఐడియా నుంచి సూపర్ ప్లాన్

Vodafone Idea has just launched an exciting new Super Hero Plan

  • ‘సూపర్ హీరో ప్లాన్’ పరిచయం చేసిన కంపెనీ
  • అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత డేటా
  • రోజుకు 2జీబీ డేటా వర్తించే ప్లాన్లకు వర్తింపు

దేశంలో మూడవ అతిపెద్ద టెలికం కంపెనీగా కొనసాగుతున్న వొడాఐడియా (వీ) టెలికం రంగంలో ప్రత్యర్థి కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్‌లకు షాక్ ఇస్తూ అద్భుతమైన కొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. ‘సూపర్ హీరో ప్లాన్’ పేరిట నూతన రీఛార్జ్ ఆఫర్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ కింద అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకంగా పన్నెండు గంటల పాటు అపరిమిత ఇంటర్నెట్ డేటాను యూజర్లు ఉచితంగా పొందవచ్చు. ఇంటర్నెట్‌ను అధికంగా వినియోగించేవారికి ఇది ఆకర్షణీయమైన ప్లాన్‌గా ఉంది.

ఈ అపరిమిత డేటా ఆఫర్ కోసం రోజుకు 2జీబీ లేదా అంతకంటే ఎక్కువ డేటాను అందించే ప్లాన్లలో ఒక దానితో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.  రోజువారీ డేటాతో సంబంధం లేకుండానే ఉచిత డేటాను ఉపయోగించుకోవచ్చు. రూ.365తో ఈ కేటగిరి ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.  రూ.365 ప్లాన్‌లో 28 రోజులపాటు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 56జీబీ డేటా లభిస్తుంది.

ప్రభుత్వరంగ టెలికం కంపెనీ అయిన బీఎస్ఎన్‌ఎల్‌లోకి కస్టమర్లు పెద్ద సంఖ్యలో పోర్ట్ అవుతున్న నేపథ్యంలో వొడాఐడియా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. సరసమైన ధరలకే చక్కటి ప్లాన్స్ అందిస్తున్న బీఎస్ఎన్ఎల్‌కు ‘సూపర్ హీరో ప్లాన్’ సవాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. వొడాఐడియా ప్రస్తుతం కూడా ‘సూపర్ హీరో ప్లాన్’ తరహాలో ఉచిత డేటా అందిస్తోంది. అయితే అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే డేటా వినియోగానికి అవకాశం ఉంది. కొత్త ప్లాన్‌లో అదనంగా 6 గంటల సమయం పెరిగింది.


 

  • Loading...

More Telugu News