Donald Trump: టారిఫ్స్ పెంచితే మీకే ఇబ్బంది చూసుకోండి.. ట్రంప్ ను హెచ్చరించిన ట్రూడో

Americans realise Trumps tariffs on Canada will make life costly Says Trudeau

  • కెనడా వస్తువులపై సుంకాలు పెంచితే అమెరికన్లపైనే ప్రభావం పడుతుందన్న ట్రూడో 
  • అంతిమంగా వస్తువుల ధరలు పెరుగుతాయని వివరణ
  • జీవన వ్యయం పెరగడం వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారని ట్రంప్ కు హితవు

కెనడా వస్తువులపై పన్నులు పెంచుతామని అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా స్పందించారు. అదనపు సుంకాలు విధించి కెనడాను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఫలితం అమెరికన్లపైనే పడుతుందని ఆయన హెచ్చరించారు. జీవన వ్యయం పెరిగిపోతుందని, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ కు ట్రూడో వార్నింగ్ ఇచ్చారు.

అమెరికా ప్రభుత్వం నుంచి ఇలాంటి సవాళ్లను ఎనిమిదేళ్ల క్రితమే ఎదుర్కొన్నామని, ఇప్పుడు కూడా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కెనడా ఎగుమతి చేసే వస్తువులపై పన్నులు పెంచితే తాము కూడా ప్రతిచర్యకు దిగాల్సి వస్తుందని ట్రూడో పరోక్షంగా ట్రంప్ కు హెచ్చరికలు చేశారు. ఈమేరకు హాలీఫాక్స్‌ ఛాంబరాఫ్‌ కామర్స్‌ నిర్వహించిన కార్యక్రమంలో ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికన్ల జీవితాలను మరింత సరళతరం చేస్తాననే హామీ వల్లే ట్రంప్ ఎన్నికల్లో గెలిచారని, కెనడా వస్తువులపై పన్నులు పెంచితే ట్రంప్ ఇచ్చిన హామీని నెరవేర్చడం అసాధ్యమని ట్రూడో చెప్పారు. పన్నులు పెంచితే ప్రతీ వస్తువు ధర పెరుగుతుందని, దీనివల్ల అమెరికన్లపై ప్రభావం పడుతుందని వివరించారు. అమెరికాకు ప్రధానంగా చమురు, విద్యుత్, సహజవాయువులను కెనడా ఎగుమతి చేస్తుందని, అల్యూమినియం, వ్యవసాయ ఉత్పత్తులకు కూడా తామే దిక్కు అని చెప్పారు. అదనపు సుంకాల వల్ల ఆహారం, దుస్తులు, ఆటోమొబైల్‌, ఆల్కహాలు, ఇతర వస్తువుల ధరలు గణనీయంగా పెరుగుతాయని ట్రూడో వివరించారు.

  • Loading...

More Telugu News