Rajya Sabha: రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖడ్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం

INDIA bloc gave notice to move a no confidence motion against Rajya Sabha Chairman Dhankhar
  • 71 మంది ఎంపీల సంతకాలతో నోటీసు
  • పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఆక్షేపణ
  • తీర్మానం ఆమోదానికి అవకాశం లేనట్టే
  • 14 రోజుల ముందుగా నోటీసు ఇస్తేనే ఛాన్స్
  • మరో 8 రోజుల్లోనే ముగిసిపోనున్న ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు
రాజ్యసభ చైర్మన్ జగ్‌‌దీప్ ధన్‌ఖడ్‌పై కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఎంపీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ధన్‌ఖడ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ మొత్తం 71 మంది ఎంపీల సంతకాలతో నోటీసు ఇచ్చినట్టు కూటమి వర్గాలు తెలిపాయి. అయితే సాంకేతికంగా ప్రస్తుత సమావేశాల్లో ఈ తీర్మానానికి ఆమోదం లభించే అవకాశం లేదు. ఎందుకంటే 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత శీతాకాల సమావేశాలు మరో 8 రోజుల్లోనే ముగియనుండడంతో ఆమోదం పొందేందుకే అవకాశం లేదు. కాగా రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కనీసం 50 మంది ఎంపీల మద్దతు సరిపోతుంది.

ఆందోళనలు చేపడుతూ సభకు అంతరాయాలు కలిగిస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీల వైఖరిని జగ్‌దీప్ ధన్‌ఖడ్ తప్పుబడుతూ వస్తున్నారు. పద్దతి మార్చుకోవాలంటూ మందలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విపక్ష పార్టీల ఎంపీలు నిర్ణయించారు.

కాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలతో పాటు ఇండియా కూటమిలోని అన్ని పార్టీల ఎంపీలు సంతకాలు చేసినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. నిజానికి తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు... అదానీ వ్యవహారంలో కాంగ్రెస్‌, ఇతర ఎంపీలతో పాటు పాల్గొనలేదు. పార్లమెంటు ఆవరణలో చేపట్టిన నిరసనల్లో పాల్గొనడం లేదు. అయినప్పటికీ రాజ్యసభ సభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసుల విషయంలో కలిసి రావడం గమనార్హం.
Rajya Sabha
Jagdeep Dhankhar
INDIA Bloc
Congress

More Telugu News