G Jagadish Reddy: తెలంగాణ సంస్కృతిపై మరోసారి దాడి చేసే ప్రయత్నం: జగదీశ్ రెడ్డి
- నిన్నటి విజయోత్సవాల్లో తెలంగాణ సంస్కృతి కనిపించలేదన్న మాజీ మంత్రి
- ఈ సంబరాల్లో ఎవరైనా జై తెలంగాణ అని నినదించారా? అని ప్రశ్న
- కాంగ్రెస్ వాళ్లు తెలంగాణ ద్రోహులు అంటూ ఆగ్రహం
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ సంస్కృతిపై మరోసారి దాడి చేసే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. నిన్న విజయోత్సవాల్లో తెలంగాణ సంస్కృతి కనిపించలేదన్నారు. నిన్న కనీసం ఏ ఒక్కరిలోనైనా ఉద్యమ భావోద్వేగాలు కనిపించాయా? ఈ సంబరాల్లో ఎవరైనా జై తెలంగాణ అని నినదించారా? అని ప్రశ్నించారు. ద్రోహుల చెంత చేరి తెలంగాణ తల్లికి మోసం చేయవద్దన్నారు.
పార్టీ గుర్తు ప్రచారం కోసం కాంగ్రెస్ తల్లిని ఆవిష్కరించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లు తెలంగాణ ద్రోహులు... తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమనే సామెతకు వారసులని జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా అక్కడ పెట్టిన పాట ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారిని నిలువెత్తున చీల్చినా... వారి రక్తంలో ఎక్కడా తెలంగాణ ఆత్మ కనిపించదన్నారు.
తెలంగాణ చరిత్రను పాతాళానికి తొక్కేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ యాసను విలన్ భాషలా... 'తెలంగాణ' అంటేనే అసహ్యించుకునే ఒక పదంలా, శాసనసభలో 'తెలంగాణ' అనే మాటనే నిషేధించే స్థాయికి వెళ్లారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అప్పట్లో ఏదో మత్తులో పడి తెలంగాణను ఏపీలో కలిపారని, ఇప్పుడు కూడా వనరులను దోచుకునే మత్తులో పడి తెలంగాణను నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాన్నారు.