Perni Nani: వైసీపీ నేత పేర్ని నానికి బిగ్ షాక్.. క్రిమినల్ చర్యలకు సిద్దమవుతున్న సర్కార్

criminal proceedings against former minister perni nani by order of civil supplies md
  • పేర్ని నాని గోడౌన్‌లో రేషన్ బియ్యం గల్లంతు
  • గల్లంతైన బియ్యం విలువ సుమారు రూ.90 లక్షలు
  • జరిమానాతో పాటు క్రిమినల్ చర్యలకు పౌర సరఫరాల శాఖ ఎండీ ఆదేశాలు
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. నాని నిర్వహిస్తున్న గోడౌన్‌లో రేషన్ బియ్యం గల్లంతు కావడంపై కేసు నమోదయింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అద్దెకు తీసుకున్న గోడౌన్‌లో దాదాపు రూ.90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మన్‌జీర్ జిలానీ ఆదేశించారు. 

బియ్యం గల్లంతు విషయంలో నానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నాని రూ.1.80 కోట్లు జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మచిలీపట్నంలో నానికి చెందిన 40వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల్గిన గోడౌన్‌ను గత ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ అద్దెకు తీసుకుని అందులో బియ్యాన్ని ఉంచారు. 
 
అయితే తన గోడౌన్‌లో ఆకస్మికంగా బియ్యం తరలించడం వల్ల తరుగు వచ్చిందని, దాదాపు 3,200 బస్తాల తరుగు ఉన్నాయని, ఆ మేరకు తాము సొమ్ములు చెల్లించేందుకు సిద్దమంటూ గత నెల పేర్ని నాని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మకు లేఖ రాశారు. దీంతో అధికారులు నవంబర్, 28,29 తేదీల్లో తనిఖీలు నిర్వహించగా, 3,700 బస్తాల (185 టన్నుల) బియ్యం తగ్గాయని గుర్తించారు. 

దీనిపై ఏమి చర్యలు తీసుకోవాలో తెలియజేయాలంటూ పౌర సరఫరాల సంస్థ ఎండీకి అధికారులు లేఖ రాశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం టన్ను బియ్యం రూ.48,500 చొప్పున గల్లంతైన బియ్యం విలువ రూ.89.72 లక్షలు, దీనికి రెట్టింపు జరిమానా వసూలు చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎండీ ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా గోడౌన్‌ను బ్లాక్ లిస్టులో పెడతామని అధికారులు వెల్లడించారు. 
Perni Nani
PDS Rice
criminal proceedings
Andhra Pradesh

More Telugu News