Divorce Case: విడాకుల కోసం భార్యకు ఏకమొత్తంగా రూ. 5 కోట్లు చెల్లించాలని భర్తకు సుప్రీంకోర్టు ఆదేశం
- రెండు దశాబ్దాలుగా విడిగా ఉంటున్న దంపతులు
- కుమారుడి విషయంలో పితృత్వ బాధ్యతలు నిర్వర్తించాల్సిన బాధ్యత తండ్రిపై ఉందన్న ధర్మాసనం
- కుమారుడి ఆర్థిక భద్రత, పోషణ కోసం కోటి రూపాయలు కేటాయించాలని ఆదేశం
విడాకుల కేసులో వివాహాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు భార్యకు శాశ్వత భరణంగా రూ. 5 కోట్లు ఏకమొత్తంగా చెల్లించాలని భర్తను ఆదేశించింది. కుమారుడి పితృత్వ బాధ్యతలు నిర్వర్తించాల్సిన బాధ్యత తండ్రిపై ఉందని, కాబట్టి శాశ్వత భరణం కింద ఆ మొత్తం చెల్లించాల్సిందేనని జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ ప్రసన్న వి.వరాలేతో కూడిన ధర్మాసనం నొక్కి చెప్పింది. అలాగే, యువకుడైన కుమారుడి ఆర్థిక భద్రత, పోషణ కోసం కోటి రూపాయలు కేటాయించాలని ఆదేశించింది.
ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ కేసులో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. వీరు రెండు దశాబ్దాలుగా వేర్వేరుగా ఉంటున్నారు. అంజుది అతి సున్నితత్వమని, తమ కుటుంబంలో ఆమె ఇమడలేదని ప్రవీణ్.. ప్రవీణ్ తనను సరిగా చూసుకోవడం లేదని అంజు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వైవాహిక బంధం నుంచి దూరం జరిగారు. ఈ నేపథ్యంలో వారికి కొన్ని ప్రత్యేకమైన షరతులతో తాజాగా అత్యున్నత న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.
దంపతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తులో భార్యాపిల్లల ప్రాథమిక అవసరాలు, ఇరు పక్షాల సామర్థ్యాలు, ఉద్యోగావకాశాలు, వారి ఆదాయ వనరులు, ఆస్తులు.. వంటి 8 కీలక అంశాలను దృష్టిలో పెట్టుకుని కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఇద్దరూ దీర్ఘకాలంగా విడిగా ఉంటున్న నేపథ్యంలో తమ వైవాహిక బాధ్యతలను నిర్వర్తించే అవకాశం లేదని, వారి మధ్య బంధం కోలుకోలేని విధంగా తెగిపోయిన నేపథ్యంలో ఈ తీర్పు వెల్లడించింది.