Pawan Kalyan: చంద్రబాబుకు ఇదంతా అవసరమా అనిపిస్తుంది: పవన్ కల్యాణ్
- విజయవాడలో విజన్-2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ
- హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- చంద్రబాబు నాయకత్వ సామర్థ్యం అమోఘం అని కితాబు
విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. విజన్ డాక్యుమెంట్ పై సంతకం చేసిన అనంతరం పవన్ ప్రసంగించారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ఈ స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో భాగస్వామం కావడం తనకెంతో ఆనందం కలిగిస్తోందని పవన్ అన్నారు.
యువకుడిగా ఉన్నప్పుడు ఎంతో సాధించాలని ఉండేదని, చాలా నేర్చుకోవాలనిపించేదని తెలిపారు. ఒక పది ఇరవై ఏళ్ల తర్వాత నువ్వు ఎలా ఉండాలనేది ముందుగా రాసిపెట్టుకోవాలని ఓ పుస్తకంలో చూశానని పవన్ వెల్లడించారు. ఒక పెద్ద నటుడ్ని అవ్వాలనో, బిజినెస్ మేన్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది... కానీ అది ఒక దిక్సూచి అని పేర్కొన్నారు.
"చంద్రబాబు విజన్-2020 అన్నప్పుడు మాదాపూర్ లో మేం చూసింది రాళ్లు గుట్టలే. కానీ చంద్రబాబు సైబర్ సిటీని చూశారు. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు గుర్తు లేకపోవచ్చు కానీ... ఆ నిర్మాణం గుర్తుండిపోతుంది. అలాంటిదే సైబర్ సిటీ కూడా. ఈ రోజున ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తోన్న సైబర్ సిటీకి రూపకర్త చంద్రబాబే.
ఇవాళ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తున్నప్పుడు మనసుకు చాలా తృప్తిగా అనిపించింది. కోట్ల మంది ప్రజలకు బలం ఇవ్వడానికి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది బాటలు పరుస్తుంది. వ్యక్తి వ్యవస్థను నిర్మిస్తే... ఆ తర్వాత వ్యవస్థ వ్యక్తులను తయారుచేస్తుంది. చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, నాయకత్వ సామర్థ్యం అమోఘమైనవి. నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చూస్తుంటే... ఆయనకు ఇదంతా అవసరమా అని చాలామందికి అనిపిస్తుంటుంది.
ఓవైపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీని నడిపించాలి... పార్టీ వ్యక్తుల్లో ఆశలు ఉంటాయి... వాటిని పరిగణనలోకి తీసుకోవాలి... మరోవైపు తన కుటుంబాన్నే కాకుండా ఐదు కోట్ల మంది ప్రజలు తన కుటుంబంలా చూసుకోవాలి... వారి అవసరాలు తీర్చాలి... ఇంకో వైపు రాజకీయ ప్రత్యర్థులు చేసే దాడులు తట్టుకోవాలి... ఇవన్నీ ఎదుర్కొంటూ నిలబడడం చంద్రబాబు ప్రత్యేకత.
ప్రధాని నరేంద్ర మోదీ వికసిత భారత్ గురించి ఆలోచిస్తుంటారు... దాన్లో విజన్-2047 కూడా ఓ అంతర్భాగం. ఒక వ్యక్తి కంటే కల... కోట్లాది మంది కలగంటే అది ఒక పరిపూర్ణ సంకల్పం... అదే మన స్వర్ణాంధ్ర విజన్-2047" అని పవన్ కల్యాణ్ వివరించారు.