Allu Arjun: అల్లు అర్జున్ విడుద‌ల ఆల‌స్యంపై.. చట్టపరమైన చర్యల యోచ‌న‌లో ఆయన తరఫు న్యాయవాదులు!

Allu Arjun Lawyers mull Legal Action over Delay in Release from Jail
  • హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ విడుద‌ల‌ చేయ‌డంలో జాప్యం అంటున్న‌ బ‌న్నీ త‌ర‌ఫు న్యాయ‌వాదులు
  • ఈ అక్రమ నిర్బంధంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదుల‌ యోచన‌
  • బెయిల్‌ ఆర్డర్ అందడంలో ఎలాంటి జాప్యం లేదన్న‌ బ‌న్నీ త‌ర‌ఫు లాయ‌ర్లు
  • అయితే, తమకు అర్థరాత్రి బెయిల్ ఆర్డర్ వచ్చిందన్న జైలు అధికారులు
సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో నటుడు అల్లు అర్జున్‌ను తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయ‌న‌ను రిలీజ్‌ చేయ‌డంలో జాప్యం చోటు చేసుకున్న‌ట్లు బ‌న్నీ త‌ర‌ఫు న్యాయ‌వాదులు చెబుతున్నారు. దీంతో ఈ అక్రమ నిర్బంధంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు యోచిస్తున్నారు.

శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలైన అనంతరం ఆయన తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీని జైలు అధికారులు స్వీకరించినప్పటికీ ఆయనను అక్రమ నిర్బంధంలో ఉంచారని అన్నారు. నిందితులను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నట్లు న్యాయవాది తెలిపారు.

"ఆర్డర్ కాపీ అందుకున్నప్పటికీ, వారు ఆయ‌న‌ను (అల్లు అర్జున్‌) విడుదల చేయలేదు. మీకు ఆర్డర్ వచ్చిన వెంటనే, మీరు నటుడిని విడుదల చేయాలని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ, వారు అలా చేయ‌లేదు. కావాల‌నే ఆయ‌న‌ను అక్ర‌మ నిర్బంధంలో ఉంచారు. దీనిపై మేము చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల కోసం పోరాడుతాం" అని న్యాయ‌వాది అశోక్ రెడ్డి చెప్పారు.

జైలు అధికారులకు బెయిల్‌ ఆర్డర్ అందడంలో ఎలాంటి జాప్యం లేదని బ‌న్నీ త‌ర‌ఫు న్యాయవాదుల‌ బృందం పేర్కొంది. తాము హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని త‌క్ష‌ణ‌మే సమర్పించామని తెలిపింది. హైకోర్టు మెసెంజర్ కూడా ఒక కాపీని అధికారులకు అందించారని పేర్కొంది.

అయితే, తమకు అర్థరాత్రి బెయిల్ ఆర్డర్ వచ్చిందని, జైలు మాన్యువల్ ప్రకారం ఖైదీలను రాత్రి సమయంలో విడుదల చేయలేమని, మరుసటి రోజు ఉదయం నటుడిని విడుదల చేసినట్లు జైలు అధికారులు తెలిపారు.

ఇక తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్‌కు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. దాంతో దాదాపు 12 గంటల తర్వాత ఈరోజు ఉదయం 6.40 గంటలకు జైలు నుంచి ఆయ‌న విడుదలయ్యారు. ఇక విడుదలైన వెంటనే బ‌న్నీ తన కుటుంబ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌కు వెళ్లారు. అక్క‌డ‌ తన లాయర్లతో సుమారు గంటసేపు మాట్లాడారు.
Allu Arjun
Tollywood
Legal Action
Chanchalguda Jail
Hyderabad
Telangana

More Telugu News