Chandrababu: సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు
- పార్టీ సభ్యత్వ సంఖ్య 73 లక్షలకు చేరుకుందన్న ముఖ్యమంత్రి
- టాప్-5లో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి ఉన్నాయని వెల్లడి
- ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలను అభినందించిన చంద్రబాబు
- పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదన్న టీడీపీ అధినేత
- కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారన్న బాబు
సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సంఖ్య 73 లక్షలకు చేరుకుందని చెప్పిన ముఖ్యమంత్రి.. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలను ఆయన అభినందించారు. టాప్-5లో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయన్నారు.
భారీగా కొత్త సభ్యత్వాలకు తోడుగా పెద్ద సంఖ్యలో యువత, మహిళల సభ్యత్వాలు నమోదైనట్లు చంద్రబాబు తెలిపారు. క్యాడర్ సంక్షేమంతో పాటు అందరి ఎదుగుదలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు.
చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ.. "పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారు. పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుంది. పార్టీ వల్లే ఏ పదవైనా అని గ్రహించి ప్రవర్తించాలి. కష్టపడనిదే ఏదీ రాదనే విషయం ప్రతిఒక్కరూ గ్రహించాలి.
ప్రజలు, పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇమ్మనడం సరికాదు. కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని నిర్లక్ష్యం చేస్తున్నారు. పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదు" అని చంద్రబాబు అన్నారు.