Atul Subhash: టెకీ అతుల్ సుభాష్ భార్య సింఘానియా అరెస్టు
- భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సుభాష్
- 24 పేజీల లేఖ, సెల్ఫీ వీడియోలో భార్యపై ఆరోపణలు
- రాష్ట్రపతికి అతుల్ రాసిన లేఖతో దేశవ్యాప్తంగా సంచలనం
భార్య వేధింపులు భరించలేక, చట్టం కూడా ఆమెకే సహకరిస్తోందంటూ తీవ్ర ఆవేదనతో బెంగళూరుకు చెందిన టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అతుల్ భార్య నికితా సింఘానియాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నికితతో పాటు ఆమె తల్లిని, సోదరుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా.. కోర్టు వారిని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించింది. నికిత అంకుల్ పరారీలో ఉన్నాడని, ఆయన కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఆత్మహత్యకు ముందు అతుల్ సుభాష్ రాసిన 24 పేజీల సుదీర్ఘ లేఖ, 80 నిమిషాల సెల్ఫీ వీడియోలో తనకు న్యాయం కావాలంటూ ఆయన చేసిన డిమాండ్ పై దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. వేధింపుల నుంచి మహిళ రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాన్ని తన భార్యలాంటి కొంతమంది మహిళలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయాన్ని అతుల్ బయటపెట్టారు. న్యాయ వ్యవస్థపై మాట్లాడేందుకు అవకాశం లేదని, కనీసం చనిపోయే వ్యక్తినైనా మాట్లాడనివ్వాలంటూ అతుల్ ఆ వీడియోలో ప్రార్థించాడు.
డబ్బు కోసం భార్య, ఆమె కుటుంబం తనను ఎంతగా వేధించింది, తప్పుడు కేసులు పెట్టి మానసికంగా క్షోభకు గురిచేసింది అతుల్ తన వీడియోలో స్పష్టంగా తెలిపాడు. బెంగళూరు నుంచి వారానికి రెండు మూడుసార్లు గురుగ్రామ్ కోర్టుకు హాజరు కావాల్సి వచ్చేదని వాపోయాడు. న్యాయస్థానాలు, చట్టాలు కూడా తనపై వేధింపులకు సహకరించాయని కన్నీటిపర్యంతమయ్యాడు. నికిత చేసిన ఆరోపణలతో తనతో పాటు తన కుటుంబం కూడా పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
రాష్ట్రపతికి లేఖ రాసి అతుల్ ఆత్మహత్య చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. నికితను అరెస్టు చేయాలనే డిమాండ్లతో పాటు ఆమెను వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగించాలంటూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు, కామెంట్లు పెట్టారు. నికిత పనిచేసే కంపెనీకి ఈ తరహా విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో ఆ కంపెనీ తన ట్విట్టర్ హ్యాండిల్ పై తాత్కాలికంగా ఆంక్షలు పెట్టుకోవాల్సి వచ్చింది.