Nimmala Ramanaidu: ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే: మంత్రి నిమ్మల రామానాయుడు

It is our responsibility to protect the girl child says AP Minister Nimmala Ramanaidu
  • గతంతో పోల్చితే ఆడపిల్లల సంఖ్య తగ్గిందన్న మంత్రి
  • భ్రూణ హత్యలపై పాలకొల్లులో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిమ్మల రామానాయుడు
  • ఇవాళ ఉదయం 2కే రన్ ప్రారంభం
ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు సందేశం ఇచ్చారు. గతంతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకనాడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయేవారని, అయితే నేడు పరిస్థితులు మారాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆడపిల్ల అంటే ఒక భారంగా అనుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. 

మహిళల రక్షణ కోసం టీడీపీ సారధ్యంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఆడ బిడ్డలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. స్వర్గీయ ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పించారని మంత్రి గుర్తుచేశారు. ఇక మహిళలు సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను  ఏర్పాటు చేశారని ప్రస్తావించారు.

ఆడపిల్లలకు అవకాశాలు ఇస్తే బాగా రాణిస్తారని, జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకాంక్షించారు. ఆడపిల్ల ఉంటే ఇంటికి ఎంతో అందమని మంత్రి నిమ్మల అన్నారు. ఆడపిల్ల తల్లికి సాయం, తండ్రికి స్నేహం, అన్నదమ్ముళ్లకు ఆసరా అని వ్యాఖ్యానించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ‘సేవ్ గర్ల్ చైల్డ్’ పేరిట మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కల్పిస్తున్నారు. ‘భ్రూణ హత్యలను నిర్మూలిద్దాం, ఆడపిల్లలను రక్షించుకుందాం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆయన 2కే రన్‌ను ప్రారంభించారు.  

ఈ రన్‌లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి రామానాయుడు మాట్లాడారు. హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ నాగరాణి, తదితరులు పాల్గొన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. మంత్రి అనితను రామానాయుడు ప్రత్యేకంగా సన్మానించారు. 
Nimmala Ramanaidu
Andhra Pradesh
Vangalapudi Anitha
Telugudesam
West Godavari District

More Telugu News